నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ముందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఏ ప్రకటన వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా.. మరో వైపు తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా అందుకు సంబంధించి వార్తలను ప్రసారం చేశాయి. ఈ తప్పుడు వార్తలపై ఆనందయ్య మాట్లాడారు.
ఆనందయ్యకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తన ఔషధం పంపిణీపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందించారు. తన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని ఆనందయ్య తెలిపారు. శుక్రవారం నుంచి పంపిణీ పునఃప్రారంభం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని వివరించారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తానని తెలిపారు. తనవద్ద ఇప్పుడు మూలికలు తగినంత స్థాయిలో లేవని అన్నారు. తాము ప్రకటించేవరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాక, తొలుత మూలికలు సేకరించుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే మందు తయారీ చేసి పంపిణీ మొదలు పెడతానని అన్నారు.
ఆనందయ్య మందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఇతర రాష్ట్రాల నుండి కూడా కృష్ణపట్నంకు వచ్చిన సంగతి తెలిసిందే..! 30-50 వేల మంది మందు కోసం ఎగబడ్డారు. మందుపై ప్రస్తుతానికి సీసీఆర్ఏఎస్ అధ్యయనం తొలి దశ పూర్తి కాగా, దాదాపు 500 మంది నుంచి సమాచారం సేకరించారు.ఆనందయ్య మందును జంతువులపై ప్రయోగించి కీలక సమాచారం సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆనందయ్య మందుపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఆనందయ్య మందుపై గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఆనందయ్య పై తీవ్ర ఒత్తిడి ఉందని.. ఆయనతో కొందరు ప్రైవేటుగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని 30 ఏళ్లుగా తాను మందు పంపిణీ చేస్తున్నానని కానీ ఇప్పుడు ఫార్ములా ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని అందుకే ప్రభుత్వం ఒత్తిడి లేకుండా చూడాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ సమయంలో ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆనందయ్య మందుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆరా తీస్తున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఆయన ఫోన్ చేశారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రాలయ పరిధిలో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం వారి సహకారంతో ఆనందయ్య మందును ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించి, పరిశోధన జరుపుతున్నామని కిరణ్ రిజిజు వెల్లడించారు. వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ. బలరాం భార్గవ్ తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిదని, ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన ప్రారంభమైందన్నారు. అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలియజేశారు. ఆనందయ్య ఔషధంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.