ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మందు తయారీ మళ్లీ పెద్ద ఎత్తున ప్రారంభమవుతోంది. కృష్ణపట్నంలోనే ఆనందయ్య ఔషధం తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తయారీకి అవసరమైన సామగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. పంపిణీపై ప్రకటన చేసేవరకు ఇతరులు ఎవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య సూచించారు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 114 సెక్షన్ కొనసాగిస్తున్నారు.
మందు పంపిణీపై కలెక్టర్ చక్రధర్‌బాబుతో ఆనందయ్య చర్చలు జరిపారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీ మొదలుపెడతామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రకటించారు. తాము చెప్పేవరకు ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనందయ్యకు ఐదు రోజుల సమయం పడుతుందని చక్రధర్ బాబు తెలిపారు. అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా అందేలా చర్యలు తీసుకొంటున్నామని.. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వారికి కొరియర్, స్పీడ్ పోస్టు ద్వారా మందులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేస్తున్నామని.. పాజిటివ్ లేని వారికి ఇచ్చే పీ రకం మందును రెండో ప్రాధాన్యతగా తయారు చేసి పంపిణీ చేస్తామని చక్రధర్ బాబు అన్నారు. కంటి చుక్కల మందు పంపిణీ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని, దీనిపై గురువారం కోర్టులో వాదనలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మందుల పంపిణీలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాల సేవలు వినియోగించుకుంటామన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని అన్నారు.
ఆనందయ్య మందు పంపిణీకి వివిధ పద్ధతులను ఎంచుకున్నారు. పాజిటివ్ వచ్చినవారికి నేరుగా అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలకు పదివేల మంది పాజిటివ్ బాధితులకు సరిపడా మందు పాకెట్లను పంపిణీ చేస్తారు. కలెక్టర్ నేతృత్వంలో ఆ జిల్లా పరిధిలోని కొవిడ్ కేర్ సెంటర్లు, హోం ఐసొలేషన్‌లో ఉన్న పాజిటివ్ బాధితులకు రెవెన్యూ, వలంటీర్ల ద్వారా నేరుగా మందు పాకెట్లు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొరియర్ సర్వీసులు లేని గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ ద్వారా పంపిణీ చేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ మందును వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ పద్ధతిలో పంపిణీ చేస్తామని తెలిపారు. మందును పోస్టు, కొరియర్ సేవల ద్వారా కూడా అందిస్తామని అన్నారు. కరోనా సోకిన వారికే తొలి ప్రాధాన్యత అని, మందును మొదట వారికే అందిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో, కరోనా రాకుండా మందు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆన్ లైన్ విధానంలో మందు పంపిణీ చేస్తున్నందున, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.