ఆనందయ్య కరోనా మందు పంపిణీ నిలిపివేత

0
799

నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేయించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ వార్త విన్న జనాలు బాధతో వెనుదిరిగారు.

ఆనందయ్య కరోనా నివారణ ఆయుర్వేద మందు గురించి భారత ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు. కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. ఈ ఆయుర్వేదంపై వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.

ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే:

ఆనందయ్య ఇస్తున్న క‌రోనా మందు గురించి ఎన్నో రాష్ట్రాలకు పాకిపోయింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు కూడా క్యూలలో నిలబడ్డారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు.. ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో.. ఎవరు సాధారణ ప్రజలో తెలియక నిర్వాహకులు కూడా ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినప్పటికీ.. ఈరోజు అక్కడికి వచ్చిన వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆనంద‌య్య మందుకోసం క‌రోనా రోగులు కూడా వెళ్లారు. నెల్లూరు జీజీహెచ్ లో క‌రోనాకు చికిత్స పొందుతున్న రోగులంతా ఉన్న‌ట్టుండి ప‌రారయ్యారని కథనాలు వచ్చాయి. ఆనంద‌య్య ఆయుర్వేద మందు క‌రోనాను న‌యం చేస్తోంద‌ని తెలియ‌డంతో అంద‌రికంద‌రు కృష్ణపట్నం వెళ్లడంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయ్యింది. ఆనందయ్య రోజుకు మూడు వేల మందికి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ ఉండగా.. ఏకంగా 30-50వేల మంది అక్కడికి చేరుకున్నారు. ఇక ఈరోజు సాయంత్రం నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేయించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

thirteen + sixteen =