ఆనందయ్య.. వ్యాక్సిన్లు రాక కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. అతని మందు కారణంగా కరోనా రోగులు బ్రతికిపోతున్నారని బయటకు తెలియడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అయితే ఆ తర్వాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొద్దిరోజుల పాటూ మందు పంపిణీని ఆపేయడం.. కోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా ఎదురుచూడడం ఇలా చాలానే జరిగాయి. దేశం మొత్తం ఆనందయ్య పేరు వినిపించింది. కానీ ఎందుకో ఆ తర్వాత ఆనందయ్య పేరు పెద్దగా వార్తల్లో నిలవలేదు.. మందు గురించిన సమాచారం కూడా పెద్దగా జనాల లోకి వెళ్ళలేదు. దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం.. కరోనా ప్రభావం తగ్గడం వంటివి చోటు చేసుకోవడంతో ఆనందయ్య మందుపై ప్రజలకు కూడా ఆసక్తి తగ్గిందనే వాదనలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయనగరంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి హాజరైన ఆనందయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసిందని ఆరోపించారు. తన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతుతోనే నిలబడగలిగానని అన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడా భయపడ్డారన్నారు. కరోనా సమయంలో మందు పంపిణీ చేసేందుకు సిద్ధమైతే ప్రభుత్వం అనుమతి లేదని చెప్పిందన్నారు ఆనందయ్య. బీసీలు అండగా నిలిచారని.. పోరాటానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూడా ఇబ్బంది వస్తుందని భావించి కోర్టు ఆదేశాలతో అనుమతి ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం భయపడిందని కొంతమంది స్వార్థపరుల సాయంతో రాజకీయ నేతలు సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఎంతోమంది కరోనా రోగులకు ఉచితంగా మందుని అందించానన్నారు. తన కుటుంబ వారసత్వం తాను కొనసాగిస్తూ ఆయుర్వేదం నేర్చుకుని కరోనాకి మందు కనిపెట్టి ప్రజలకు పంపిణీ చేశానన్నారు. లక్షలు మంది నమ్మకాన్ని చెడగొట్టేలా ప్రయత్నాలు జరిగాయని.. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శలు చేశారు.