ఆనందయ్య అందిస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం నుండి ఏపీ హై కోర్టు నుండి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే..! సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగతా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరగ్గా ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఆనందయ్య ముందుకు అనుమతులు రాగానే మందు పంపిణీపై కలెక్టర్ చక్రధర్‌బాబుతో ఆనందయ్య భేటీ అయ్యారు. మందు పంపిణీ విధివిధానాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు హాజరయ్యారు. నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఆనందయ్య, కాకాని నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిబంధనల ప్రకారం మందును పంపిణీ చేయాలని.. ఔషధం పంపిణీకి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై చర్చించారు. ఆన్ లైన్ విధానంలో ఆనందయ్య మందు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు కృష్ణపట్నం రావొద్దని, ఆన్ లైన్ విధానంలో ఇంటి వద్దకే మందు అందజేస్తారని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో కరోనా మందు పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. గతంలో ఆనందయ్య మందు కోసం పెద్ద ఎత్తున జనం ఎగబడిన సంగతి తెలిసిందే..! కొన్ని వేళల్లో ప్రజలు కృష్ణపట్నానికి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు, అధికారులకు చాలా కష్టమైంది. ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో తెలియకుండా వేల మంది బారులు తీరడం వివాదాస్పదమైంది. అందుకే ఇకపై ఇలాంటివి జరగకుండా ఆనందయ్య మందును కొరియర్ లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.