ఖలిస్థాన్ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతున్న కెనడాను భారత్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు కెనడాను దోషిగా నిలబెట్టడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటికే భారత్ కెనడాపై పలు ఆంక్షలు విధించేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జార్ హత్య వెనుక భారత్ ఉందని తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా.. భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. ఈ క్రమంలోనే ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ కెనడా రాయబారిని బహిష్కరించింది. కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ సూచనను కూడా జారీ చేసింది.
ఇలాంటి సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దరఖాస్తు చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో, సెప్టెంబర్ 20, 2023న కార్యకలాపాలను మూసివేయడానికి అవసరమైన పత్రాలను కార్పొరేషన్ కెనడా నుంచి అనుమతి కోసం రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ స్వీకరించిందని తెలుస్తోంది. దీంతో రేసన్స్ ఆపరేషన్ ఆగిపోయాయి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం సెప్టెంబర్ 20, 2023 నుంచి దానితో ఎలాంటి సంబంధం లేదని మహీంద్రా తెలిపింది. రేసన్ లిక్విడేషన్‌పై కంపెనీకి 4.7 కెనడియన్ డాలర్లు లభిస్తాయి. ఇది భారత కరెన్సీలో రూ. 28.7 కోట్లు. ఈ విషయం బయటకు రావడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్‌లో భారీ పతనం జరిగింది.