More

    తమిళనాడుకు చెందిన ఇడ్లీ అమ్మకు ఆనంద్ మహీంద్రా నుండి ఊహించని బహుమతి

    ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన మాటను నిలబెట్టుకున్నారు. ఆనంద్ మహీంద్రా తమిళనాడుకు చెందిన ‘ఇడ్లీ అమ్మ’కు సొంత ఇంటిని కానుకగా ఇచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడంతో ప్రజలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఇడ్లీ అమ్మ గురించి ఒక ట్వీట్‌ను షేర్ చేసారు. ఇడ్లీ అమ్మ తన ఇంట్లో వండిన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ వచ్చారు. అప్పట్లోనే ఆమెకు ఆనంద్ మహీంద్రా సొంత ఇంటిని అందిస్తానని వాగ్దానం చేశారు.

    ఆదివారం నాడు మదర్స్ డే సందర్భంగా ఇడ్లీ అమ్మ తన కొత్త ఇంటికి ప్రవేశిస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. తన మాటను నిలబెట్టుకున్నట్లు తెలిపాడు. మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు ఇంటిని బహుమతిగా అందించడానికి ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసినందుకు తమ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఆనంద్ మహీంద్రా. ఇకపై ఎండలో, వానలో “ఇడ్లీ అమ్మ” కష్టపడనక్కర్లేదని, ఆమెకు సౌకర్యంగా ఉండేలా ఆ ఇంట్లో ప్రత్యేకంగా వంటగదిని నిర్మించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ మంచిపనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    ఇడ్లీ అమ్మను కమలతల్ అని కూడా పిలుస్తారు, తమిళనాడులోని వడివేలంపాళయం అనే గ్రామంలో నివసిస్తున్నారు. ఆమె సుమారు 37 ఏళ్లుగా సాంబార్, చట్నీతో కూడిన ఇడ్లీలను కేవలం రూపాయికే విక్రయిస్తున్నారు. ఆమె కథనం 2019లో వైరల్ అయింది. ఆమెకు ఆనంద్ మహీంద్రా తన మద్దతును అందించారు. భూమి పూజ దగ్గర నుండి ఆమె ఇల్లు పూర్తయ్యే వరకూ ఆనంద్ మహీంద్రా బృందం మద్దతుగా నిలిచింది. తనకు ఇల్లు కట్టించినందుకు ఇడ్లీ అమ్మ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories