More

    మహీంద్రా షోరూమ్ లో రైతుకు జరిగిన అవమానంపై స్పందించిన ఆనంద్ మహీంద్రా

    మహీంద్రా షోరూంలో ఓ రైతుకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..! ఆ వీడియోను ఆనంద్ మహీంద్రాకు పలువురు ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై ఆనంద్ మహీంద్రా అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘మా కమ్యూనిటీలోని వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పనిచేయడమే మహీంద్ర సంస్థ ప్రధాన లక్ష్యం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడడం మాకు ఎంతో ముఖ్యంగా. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తెలిస్తే అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు. “The Core Purpose of @MahindraRise is to enable our communities & all stakeholders to Rise.And a key Core Value is to uphold the Dignity of the Individual. Any aberration from this philosophy will be addressed with great urgency.” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో తెలిపారు.

    మహీంద్రా సంస్థ సీఈవో విజయ్ నక్రా ఈ ఘటనపై స్పందించారు. తమ వినియోగదారుల గౌరవాన్ని కాపాడడం తమ బాధ్యతని అన్నారు. డీలర్లు వినియోగదారుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కస్టమర్లను గౌరవించే విషయంలో ఫ్రంట్ లైన్ సిబ్బందికి కౌన్సిలింగ్, శిక్షణనిస్తామని తెలిపారు.

    రూ.10 కూడా ఉండవు రూ.10 లక్షల కారు కొంటావా?

    కర్ణాటకలోని తుమకూరు జిల్లా రమణపాళ్యకు చెందిన కెంపెగౌడ అనే రైతును కార్ షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అవమానించారు. దీంతో డబ్బుల కట్టలు తెచ్చి షోరూమ్‌ సిబ్బంది ముందు పెట్టాడు. ‘అడిగిన డబ్బు కట్టా. తక్షణం కారు డెలివరీ చేయండి’ అంటూ డిమాండ్‌ చేశాడు ఆ రైతు. కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి ఓ కార్ల షోరూమ్‌కు వెళ్లాడు. బొలేరో పికప్‌ వెహికిల్‌ కావాలని అడిగాడు. అతడి వేషభాషలను, వెంటనున్న మిత్రబృందాన్ని చూసిన షోరూమ్‌ సిబ్బంది వాళ్లను తక్కువగా అంచనా వేసి.. సరిగా స్పందించలేదు. అతడిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కెంపెగౌడ కారు ఖరీదెంత అని సిబ్బందిని అడిగాడు. పదిలక్షలని ఆఫీసర్‌ సమాధానమిచ్చాడు. డబ్బు కడితే వెంటనే కారు డెలివరీ చేస్తారా? అని అడిగాడు. ముందు డబ్బుతో రా అంటూ సమాధానం రావడంతో అక్కడి నుండి కెంపెగౌడ వెనుదిరిగాడు.

    అరగంటలో కెంపెగౌడ తిరిగి వచ్చి.. సేల్స్‌మన్‌ టేబుల్‌ ముందు అవసరమైన డబ్బును పెట్టాడు. కారు డెలివరీ చేయాలని కోరాడు. షోరూమ్‌ సిబ్బంది వెంటనే డెలివరీ ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. కెంపెగౌడ మిత్ర బృందం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మాకు వాహనం వద్దు.. అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలి’ అని కెంపెగౌడ పోలీసులతో అన్నాడు. కెంపెగౌడ, అతని స్నేహితులు తమకు ఎదురైన అవమానానికి కోప్పడ్డారు. తనను, తన స్నేహితులను అవమానించినందుకు షోరూమ్ నుండి లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు ఆ రైతు.

    Trending Stories

    Related Stories