ప్రతి ఏడాది దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులతో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ లో పర్యటించారు. సరిహద్దుల్లో తెగించి విధులు నిర్వర్తిస్తున్న వీరజవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఉల్లాసంగా గడిపారు.
మోదీ ఇలా ప్రతి ఏడాది సైనికులతో దీపావళిని జరుపుకోవడాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉంటారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘మోదీ ఒక అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పారని’ ప్రశంసించారు. దేశ ప్రజలు ఎలాంటి భయం లేకుండా దీపావళి జరుపుకుంటున్నారంటే అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న జవాన్ల వల్లేనని తెలిపారు. తమ కుటుంబాలను కూడా వదిలి వారు దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం వల్లే మనం మన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోగలుగుతున్నామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
కేదార్‌నాథ్ లో మోదీ:
ప్రధాని మోదీ శుక్రవారం నాడు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయాన్నే ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌కి చేరుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ చేరుకున్నారు. అనంతరం పర్వత శ్రేణుల్లో కలినడకన నడుస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ తర్వాత మళ్లీ నిర్మించారు. సరస్వతి ఘాట్ తో పాటు రూ. 130 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇన్ ఫ్రా ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
మోదీ కేదార్‌నాథ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు దేశ వ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు.