నెల్లూరు జిల్లాలో ఓ కీలక నేత అధికార పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? మాజీ మంత్రి.. ఎక్స్ పీరియన్స్ డ్ పొలిటీషియన్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆ సీనియర్ లీడర్ ఎందుకు హర్ట్ అయ్యారు? మామూలుగా ఎంతో సాఫ్ట్ గా ఉండే ఆ.. ఎమ్మల్యే ఇటీవల హాట్ కామెంట్స్ చేయడానికి కారణాలేంటి? ఆయన సేవలను వైసీపీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఇంతకూ ఎవరా వైకాపా ఎమ్మల్యే? సైకిల్ ఎక్కాలన్న ఆలోచన ఆయనకెందుకు వచ్చింది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ…
పాలిటిక్స్ లో ఎప్పడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ నాయకుడి స్టేట్ మెంట్ వెనుక ఏ ఆలోచన ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డిగ్నిఫైడ్ పొలిటీషియన్ గా పేరున్న రామనారాయణరెడ్డి విషయంలో కూడా ఇటీవల రాజకీయంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైకాపాలో చేరారు రామనారాయణరెడ్డి. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నఎమ్మెల్యేగా అటు అధిష్టానం వద్ద ఇటు ప్రజల్లోనూ ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే శాసనసభ్యుడిగా గెలిచాక.. ఏడాది తిరిగే లోపే ఆయన చేసిన హాట్ కామెంట్స్ అటు పార్టీలోనూ.. ఇటు జిల్లా రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టించాయి. స్వచ్ఛమైన తేనె వెంకటగిరిలో దొరికితే… నెల్లూరు నగరంలో మాఫియా రాజ్యమేలుతోంది.. అంటూ ఎమ్మల్యే ఆనం చేసిన కామెంట్స్ పై అధిష్టానం సీరియస్ అయింది. లక్ష్మణరేఖ దాటొద్దు.. అంటూ పార్టీ అధిష్టానం ఆయనను హెచ్చరించింది. మరోవైపు తనకంటే రాజకీయ అనుభవం తక్కువ ఉన్నవారికి మంత్రి పదవులు కట్టబెట్టి తన కుటుంబాన్ని.. అనుచరులను నెల్లూరు నగరంలో టార్గెట్ చేయటాన్ని సహజంగానే ఆనం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోకడలను చూసి ఆనంకు చిర్రెత్తుకొచ్చింది. తన అన్న ఆనం వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను అనిల్ కుమార్ తొలగింపజేశారనే విషయమై అనిల్.. ఆనం మధ్య తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. ఆ తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పదవి పొందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందన సభలోనూ మాజీ మంత్రి అనిల్ కుమార్ పై ఆనం చేసిన ఘాటైన విమర్శలు అప్పట్లో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను కలవటం నెల్లూరు రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో త్వరలో ఆనం కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరనుందని, కైవల్యారెడ్డి 2024 లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపద్యంలో ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నిక నగారా మోగడంతో మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పలువురు శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు హాజరైన ఈ కార్యక్రమానికి ఆనం మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీని వీడబోతున్నారనే ప్రచారం ఊపందుకొంది. దీనికితోడు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఏడుగురు మంత్రులను.. ఏడుగురు శాసనసభ్యులను నియమించిన ముఖ్యమంత్రి జగన్ ఆనం రామనారాయణరెడ్డి ని మాత్రం పక్కన పెట్టడం కూడా తన అసంతృప్తికి ముఖ్య కారణమని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఆత్మకూరు నియోజకవర్గంపై ఆనం కు గట్టి పట్టుంది. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మల్యేగా గెలుపొంది ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. ఆనం పలు అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టి ఆత్మకూరు స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికీ ఆనం కుటుంబానికి ఆ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. ఐనప్పటికీ వైకాపా ఆయనను ఉప ఎన్నికకు దూరం పెట్టడంతో ఆనం త్వరలోనే వైకాపాను వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు ఆనం నిరాకరిస్తున్నారు. కాగా 2024 ఎన్నికల నాటికి ఆనం కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరటం ఖాయమని ఎమ్మల్యే కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.