తాలిబాన్లు పంజ్ షీర్ ను సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..! ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను చంపేశారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా సాలేహ్‌ను తొలుత కొరడాలు, విద్యుత్ వైర్లతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా సలేహ్ పంజ్‌షీర్ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబాన్లకు చిక్కాడనే ప్రచారం సాగుతోంది. పంజ్ షీర్ లోయలో రోహుల్లా సలేహ్ కు చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబాన్ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి. దాంతో రోహుల్లా సలేహ్ మరణించారన్న విషయం దాదాపు నిర్ధారణ అయింది. ఆఫ్ఘన్ లో మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉండడంతో పంజ్ షీర్ లోయలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టతలేదు.

సెప్టెంబర్ 6 న తాలిబాన్లు పంజ్‌షీర్ లోయపై నియంత్రణ సాధించగలిగామని ప్రకటించారు. అయితే తాము ఇంకా తాలిబాన్ల తో పోరాడుతున్నామని ప్రతిఘటన దళాలు ప్రకటించాయి. ఆ తర్వాత పంజ్‌షీర్ ప్రావిన్స్‌లోని దివంగత గెరిల్లా కమాండర్ అహ్మద్ షా మసౌద్ సమాధిని తాలిబాన్లు ధ్వంసం చేశారు. తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసౌద్, అమృల్లా సలేహ్‌తో కలిసి తాలిబాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటనను కొనసాగించడానికి పంజ్‌షీర్ లోయకు వెళ్లిపోయారు. పంజ్‌షీర్ లోయ తాలిబాన్ వ్యతిరేక పోరాట యోధుల చివరి కోటగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఇంకా 60 శాతం పంజ్‌షీర్ తమ ఆధీనంలోనే ఉన్నదని జాతీయ ప్రతిఘటన దళం తెలిపింది.

మహిళల ఆందోళనలను కవర్ చేశారన్న కారణంతో ‘ఎటిలాట్రోజ్’ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను బంధించిన తాలిబాన్లు తీవ్రంగా కొట్టారు. శరీరంపై గాయాలతో ఉన్న ఆ జర్నలిస్టుల ఫొటోలను సదరు మీడియా సంస్థ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. దేశంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలంటే ముందుగా న్యాయమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, నిరసనలు తెలిపే చోటు, ప్రదర్శించే ఫ్లకార్డులు, నినాదాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు తిరిగిరావాలని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని తాత్కాలిక ప్రధాని ముల్లా మహమ్మద్ హాసన్ అఖుంద్ చెప్పారు.
