More

    అమిత్ షా ‘పరుసవేది’..! అమ్ములపొదిలో 9 వ్యూహాలు..!!

    యుద్ధ వ్యూహం-రాజకీయ వ్యూహం పరస్పర ఆధారితాలు. రాజకీయ లక్ష్య సాధనలో యుద్ధం అనివార్యంగా తారసపడవచ్చు. లేదా రణరంగమే రాజకీయ వాతావరణాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని మైదానాన్ని సాంతం నియంత్రించవచ్చు. యుద్ధం-రాజనీతి ఒకే నాణేనికి బొమ్మ-బొరుసు.

    “War is nothing but a continuation of politics with the admixture of other means.” అంటాడు ప్రష్యన్ వార్ జనరల్ కార్ల్ వొన్ క్లాస్ విట్జ్. యుద్ధం రాజకీయాలకు కొనసాగింపే…! కాకపోతే కొత్త మేళవింపులు చేరతాయంతే!

    ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యానంతర భారత రాజనీతి చరిత్రలో వ్యూహాత్మక ఎత్తులు వేసి, ప్రత్యర్థిని చిత్తుచేసిన సందర్భాలు అరుదు. జనం త్యాగాలనూ, కొంతమంది మహానీయుల నిరపేక్ష సేవలనూ వల్లెవేసి పబ్బం గడుపుకున్న పార్టీ ఒకటి ఎన్నెళ్లో రాజ్యామేలింది.

    కాలం మారింది. రాజకీయాలకు సాంస్కృతిక అంశను జోడించిన ఘటికుల బృందం రంగ ప్రవేశం చేసింది. వాతావరణంలో మార్పు అనివార్యమైది. గడచిన నాలుగు దశాబ్దాలుగా రాజకీయ మైదానంలో ఉద్రిక్తత పాలు హెచ్చింది. వ్యూహచతురత గల నేతలు నూటపాతికేళ్ల పార్టీకి ముప్పు తిప్పలు పెట్టే రోజులొచ్చాయి.

    2014 తర్వాత ఈ ఉద్విగ్నత స్థాయి పెరిగింది. అమిత్ షా లాంటి ఆరితేరిన వ్యూహకర్త, లౌక్యం-ధైర్యం కలబోసిన నరేంద్ర మోదీ లాంటి నేత హస్తినలో కాలుమోపారు. ఇటీవలి కాలంలో అమిత్ షా అచ్చెరువొందే వ్యూహచతురతను కనపరుస్తున్నారు.

    2021లో ‘షా’ మార్క్ చాణక్యం మరింత ప్రచండమై తీరుతుందని సూచనలు వెలువడుతున్నాయి. ‘‘Nine Strategies of Political Ground’’ ను సిద్ధం చేసిన అమిత్ షా బృందం…తొమ్మిది భిన్న వ్యూహాలను అందుకు తగిన ఎత్తుగడలను రచించిందని భోగట్టా. అవేంటో చూద్దాం….

    1. Control the Agenda- ప్రాధాన్య అంశాల నియంత్రణ
    2. Select the Decision Criteria- నిర్ణయ ప్రామాణికత గుర్తింపు
    3. Control Access to Information- సమాచార సౌలభ్యం
    4. Use Outside Experts – తటస్థ నిపుణుల వినియోగం
    5. Control Access to Influential People – చొరవ, ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులతో బంధం
    6. Form a Coalition- కూటమి ఏర్పాటు
    7. Co-opt the Opposition – ప్రతిపక్షాన్ని మచ్చిక చేసుకోవడం
    8. Manipulate Symbols – నేర్పుతో గుర్తులను సంబాళించడం
    9. Use Interpersonal Manipulation – ప్రతీప శక్తుల్లోని వేగులతోనే పనికానివ్వడం

    వీటి గురించి వివరంగా తెలుసుకునే ముందు రాజనీతిలో ఇంత గాఢమైన, తీవ్రమైన అంశాలు ఉండటానికి కారణమేంటో ప్రాచీనతలోకి తొంగి చూద్దాం…

    ‘‘నాతప్త లోహో లోహేన సంధీయతే!’’ అన్నాడు చాణక్యుడు. కణ కణ మండే నిప్పుకణికల్లో కాల్చకుండా లోహం-లోహంతో అతకదని అర్థం. చంద్ర గుప్త మౌర్యుడికి చాణక్యుడు తోడయ్యాడు. నేటి చాణక్యుడు సాక్షాత్తూ మంత్రివర్గ సహచరుడు.

    కౌటిల్యుడు ‘రాజనీతి సూత్రాణీ’ రచించాడు. వర్తమాన చాణక్యుడు ‘అమిత్ షా’ కంటికి కనిపించని వ్యూహతంత్రాన్నిరాజకీయ రణ క్షేత్రంలో పోతపోస్తున్నాడు. అలెగ్జాండర్ ను నిలువరించి, అఖండ భారతాన్నిఐక్యంగా ఉంచాలని ప్రతినబూనినవాడు.  జగజ్జేతలను మట్టికరిపించిన రణచతురుడు చాణక్యుడు.

    ‘యుద్ధ ఆరంభంలో కొన్ని సన్నివేశాలు చాలా తేలిగ్గా, సులభంగా తోస్తాయి. అయితే, సులభమైనవే సంక్లిష్టమైనవని తీరా తెలుస్తుందీ’…అంటుంది, బాణభట్టుని ‘హర్షచరితం’. బాణుడు కూడా ప్రాచీన భారత యుద్ధ సంప్రదాయంలో అనన్యుడూ…అనితరసాధ్యుడూ కూడా.  

    అమిత్ షా పోతపోసిన ‘పరుసవేది’లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని ఈపాటికే ప్రాథమిక దశలో కొన్ని ప్రాంతాల్లో అనుసరించి ఫలితాలు పొందారు. వాటి ఉదాహరణలు కూడా చూద్దాం.

    Control the Agenda– ప్రాధాన్య అంశాల నియంత్రణ:

    కమిటీల నిర్ణయాలు సభ్యుల అభిప్రాయాల ప్రాతిపదికన మాత్రమే ఉండకూడదు. స్వయంగా కమిటీ సమష్టిగా సదరు నిర్ణయం చేసేందుకు కావాల్సిన కసరత్తు చేసిందా లేదా అన్నది ముఖ్యం. కీలక అంశాల విషయంలో ప్రతిదీ ఎజెండాలో పెట్టాలన్నయాంత్రికత కూడదు. అవసరమైనపుడు అవసరమైనచోట వాటిని చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.

    ఎజెండాలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను దగ్గర ఉంచుకోవాలి. కూలంకషంగా చర్చించే ఓర్పు, విశాల దృక్పథం ఉండాలి. నిర్దిష్ట అంశానికి సంబంధించిన స్వీయానుభవ సమాచారం విధిగా ఉండాలి. పైపై పరిశీలనలతో నిర్ణయాలు తీసుకోకూడదు.

    ఈ సూత్రాన్ని  ఎలా  ఆచరిస్తున్నారో చూద్దాం.

    గతంలో ప్రభావం ఉన్న నేతలు లేదా ప్రధాన సామాజిక వర్గం నేతల అభిప్రాయలకు విలువ అధికంగా ఉండేది. ఇప్పుడు సామాన్య కార్యకర్తలు కూడా నేతలు కావడంతో పాటు ప్రధాన అంశాలకు సంబంధించిన అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఏర్పడినట్టూ ఇటీవలి అనుభవాలు చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు లోతైన విషయాలపై సైతం పైపై వ్యాఖ్యానాలు వినిపించేవి. ఇప్పుడు స్వీయానుభవంతో పాటు, నిర్దిష్టమైన అంశానికి సంబంధించి వివరాలు, గణాంకాలను ఆ పార్టీనేతలు వెల్లడించడం, అందుకు సంబంధించిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.

    Select the Decision Criteria– నిర్ణయ ప్రామాణికత గుర్తింపు:

    ప్రజలు సహజంగానే తమ అవసరాల ప్రతిపాదికనే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పరచుకుంటారు. వాటిపైనే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొంతమంది ప్రభావ శీలమైన వ్యక్తులు ‘ప్రమాణాన్నే’ మార్చగలరు. అటువంటప్పుడు ప్రజల నిర్ణయాల ప్రాధాన్యత కూడా మారుతుంది. ప్రజల నిర్ణయాత్మకతను చాలా సులభంగా సంబాళించవచ్చు. ప్రజల నిర్ణయాత్మకత నిర్దిష్ట స్థితి లేదా సమయంపై ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రత్యామ్నాయాలను సూచించి ఒప్పించగలగాలి. వాదించి ఒప్పించడం కన్నా ఓటర్ల నిర్ణయానికి కారణమైన ‘ప్రమాణాన్ని’ మార్చాలి.

    ఉదాహరణ చూద్దాం:

    గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు ఫలితాలు ఎలా ఉంటాయన్న అంచనా ఎవరికీ లేదు. గత ఎన్నికల్లో 99 గెలుచుకున్న టీఆర్ఎస్ కు ఎన్ని స్థానాలు వస్తాయో తెలియదు. 4 స్థానాలకు పరిమితమైన బీజేపీకి ఎన్ని స్థానాలు పెరుగుతాయో అంచనా లేదు. మహానగరం నరక కూపంగా మారిందన్న వ్యతిరేకత ఓటర్లకు ఉంది. అయితే వరదలు వచ్చాక-నష్టపరిహారం పేరుతో జరిగిన జగన్నాటకం మొత్తం స్థితిని మార్చేసింది. అంతేకాకుండా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య హిందూత్వ అంశం బలంగా మారి ఓటింగ్ సరళిని మార్చేసింది. అంటే ప్రజలు తమ ప్రమాణాల ఆధారంగా అంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు మారడానికి కారణం తర్వాత మారిన ప్రమాణాలే. దీంతో నిర్ణయాలు కూడా సహజంగా మారాయి.

    Control Access to Information– సమాచార సౌలభ్యం:

    ‘సమాచారం’ అత్యంత శక్తివంతమైన సాధనం. రాజకీయ శక్తుల పరస్పర యుద్ధంలో ‘సమాచారం’ ఒక ఆయుధం. కీలక సమాచారంతో మొత్తం స్థితిని మార్చేయవచ్చు. వైరి పక్షాల నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ప్రభుత్వ ప్రాజెక్టుల నివేదికలు, అభివృద్ధి ప్రతిపాదనల పేరిట ప్రైవేట్ కన్సల్టెన్సీలు ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్టులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య జరిగే లావాదేవీలకు సంబంధించిన సమాచారం అత్యంత కీలకం. వ్యూహాన్ని రూపొందించడంలో ప్రాథమిక వనరు.

    ఉదాహరణ చూద్దాం:

    జైలు శిక్ష అనుభవిస్తున్నఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్-లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు లీకేజీ నేపథ్యంలో బీహార్ లో 2015లో ఏర్పడిన ఆర్జేడీ-జేడీ(యూ) ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించి ‘మహాఘట్ బంధన్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఆడియో టేపుల బాగోతం బయటపడిన తర్వాత ఆర్జేడీకి దూరమై చివరకు ఎన్డీఏలో చేరిపోయారు. కేవలం రెండు నిమిషాల నిడివి కూడా లేని ఆడియో టేపు వ్యవహారం ఓ ప్రభుత్వమే కుప్పకూలిపోవడానికి కారణమైంది. అంతేకాదు, ఆ రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడటానికి హేతువైంది.

    Use Outside Experts – తటస్థ నిపుణుల వినియోగం:

    సమస్యతో సంబంధం లేకుండా అభిప్రాయాలను ప్రభావితం చేయగల తటస్థ నిపుణుల మద్దతు చూరగొనడం అత్యవసరం. ప్రముఖుల వ్యక్తిగత అభిప్రాయాలు సామూహిక ప్రభావాన్ని నెరపుతాయి. ప్రజల నిర్ణయాలను మార్చే శక్తి ఉంటుంది. రాజకీయ వ్యవహారంలో తటస్థ నిపుణుల వినియోగం అత్యంత ఆవశ్యకం.

    ఉదాహరణ:

    కేరళలో రాబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక ప్రభుత్వ పదువుల్లో ఉండి పదవీ విరమణ పొందిన ప్రముఖులను, పేరున్న న్యాయవాదులను, విశ్రాంత పోలీసు అధికారులను కలిసి మద్దతు కోరింది. ఇందుకు సంబంధించిన వార్తను ఫిబ్రవరి 16న హిందూ పత్రిక ప్రచురించింది. ఉత్తర ప్రదేశ్ లో ఏప్రిల్ 30 పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా బీజేపీ నేతలు ప్రముఖులను కలిసే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన వార్త ఫిబ్రవరి 11 ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో చూడవచ్చు. కేరళ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి చిదంబరేష్,  పీ.ఎన్.రవీంద్ర, మరో అడిషనల్ డీజీపీ లు బీజేపీలో చేరిన ఉదంతాలు ఇలాంటి వ్యూహంలో భాగమే!

    Control Access to Influential People – చొరవ, ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులతో బంధం:

    సాంకేతిక రంగంలో సృజనాత్మకతను, సరికొత్త ఆలోచనలను ప్రతిపాదించే మేధోబృందాలు, వ్యక్తులు సహజంగా రాజకీయాలకు దూరంగా ఉంటాయి. అనేక ప్రజోపయోగ పనులు చేయడంలో వారి పాత్ర ఎంతో ఉంటుంది. అయితే వారు స్వయంగా రాజకీయ పార్టీలను సంప్రదించేందుకు ఇష్టపడరు. అలాంటి వారిని ఆకర్శిస్తే…మొత్తంగా ఫలితాలు ఊహించని విధంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

    ఉదాహరణ:

    ‘మెట్రోమ్యాన్’గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్ హఠాత్తుగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో కేరళ ఎన్నికల చిత్రపటంలో మార్పు సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటారు నిపుణులు.

    Form a Coalition– కూటమి ఏర్పాటు:

    ఏ రాజకీయ విభాగాల్లో చేరకుండా స్వతంత్రంగా పనిచేస్తున్న బృందాలు అనేకం ఉంటాయి. విడి విడిగా ఉండటం మూలంగా బలమైన ప్రభావం వేయలేవు. కాలనీ అసోషియేషన్ లు, పెన్షనర్ వెల్ ఫేర్ అసోషియేన్లు, యూత్ ఫెడరేషన్ లను ఏకం చేస్తే… సామాజిక కార్యక్రమాలతో పాటు…పరోక్షంగా రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది.

    ఉదాహరణ: దేశ వ్యాప్తంగా శివాజీ, వివేకానంద జయంతుల నిర్వహణ క్రమంగా పెరగడానికి కారణం ఇదే కావచ్చేమో!

    Co-opt the Opposition – ప్రతిపక్షాన్ని మచ్చిక చేసుకోవడం:

    నిరంతరం విమర్శకు దిగే రాజకీయ పక్షాలను చీల్చాలి. ఆవలి పక్షంలో ప్రభావం ఉన్న, పేరున్న నేతను అవకాశం దొరికినప్పుడంతా….ప్రముఖ వేదికలపై నుంచి పొగడ్తలు కురిపించాలి. ఆ పొగడ్తల పర్వం చీలకకు కారణమవుతుంది. అంటే వ్యతిరేకులలో చీలిక తేవడం అన్నమాట.

    ఇది వైరి బలహీనతను ప్రస్ఫుటం చేస్తుంది. ప్రతిపక్షంలో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం తెలియగానే ఎవరిని తమవైపు తిప్పుకోవాలో అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగాలి.

    ఉదాహరణ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను పార్లమెంట్ వేదికగా ప్రధాని పొగడ్డంతో కాంగ్రెస్ లో ఓ చీలికకు మార్గం సుగమం అయింది. అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ లో కుమ్మలాటలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆజాద్ ఆ పదవి ఆశిస్తున్నాడనే విషయం కూడా బహిరంగ రహస్యమే! ఇక్కడే మోదీ పాచిక విసరిరారు.

    Manipulate Symbols – నేర్పుతో గుర్తులను సంబాళించడం:

    ప్రత్యర్థిని డైలమాలో పడేయాలన్నా, తమ పక్షానికి మద్దతు కూడగట్టాలన్నా సమయానుకూలంగా, సందర్భాన్ని బట్టి ఓ ప్రత్యేక గుర్తును సృష్టించి ప్రచారం చేయగలగాలి. అలా చేయలేనప్పుడు ఓ ఆకర్శించే వ్యాఖ్యను జత చేయాలి. సదరు గుర్తును, విశేషించి వ్యాఖ్యను ప్రజలను ఆకట్టుకుంటాయి. దీంతో రాజకీయ పక్షాల అభిప్రాయాలను, విమర్శలను ప్రజలే ఐచ్ఛికంగా ప్రచారం చేస్తూ ఉంటారు.

    ఉదాహరణ: రాహుల్, ప్రియాంక, సోనియా లాంటి నేతల విషయంలో అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మీమ్స్ లాంటి ఈ కోవలోకే వస్తాయి.

    Use Interpersonal Manipulation – ప్రతీప శక్తుల్లోని వేగులతోనే పనికానివ్వడం:

    కొన్నికీలక సందర్భాల్లో…వైరి పక్షాల మద్దతు కూడా అనివార్యమవుతుంది. మరీ ముఖ్యంగా అధికార పక్షానికి ప్రధాన బిల్లుల ఆమోదానికి తగిన బలం లేనప్పుడు లోపాయికారిగా వైరి పక్షాల్లోని వేగులతో తాత్కాలికంగా ఓ మద్దతు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడినప్పుడు ఇలాంటి వ్యూహం అవసరమవుతుంది.

    ఉదాహరణ:

    రాజ్యసభలో తగినంత బలం లేకపోయినా అనేక కీలక బిల్లులు-ట్రిపల్ తలాక్ బిల్లు, 370 అధికరణం రద్దు లాంటి సందర్భాల్లో రాజ్యసభలో బీజేపీ వ్యతిరేకులు కూడా మద్దతు తెలిపారు.

    ఇవీ అమిత్ సా  Nine strategies of political ground ధర్మం గెలవాలంటే యుద్ధం జరగాల్సిందే.. ఆ యుద్ధంలో విజయం సాధించాలంటే  వ్యూహం కావాల్సిందే.

    చివరగా….

    నేషనలిస్ట్ హబ్ వివరణతో కూడిన ఓ క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఏడాదిన్నరగా తరచూ మేం రెఫర్ చేస్తున్న సోర్స్-మూలాన్ని వీలైనంత మేర తెలియజేస్తూ వచ్చాం. మరికొన్ని చోట్ల విస్మరించాం. ఇక ఇప్పటి నుంచీ రెఫరెన్స్ వివరాలు తెలియజేస్తాం. ఈ వీడియోలో చాణక్యుడు, బాణభట్టుడి గురించి ప్రస్తావించాను. వాటిని ప్రస్తావించడానికి స్వర్గీయ శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి తెలుగు తాత్పర్య గ్రంథం ‘‘చాణక్య నీతి సూత్రాలు’’ గ్రంథాన్ని సంప్రదించాం. దీన్ని సంస్కృత భాషా ప్రచార సమితి ప్రచురించింది. ఇక రెండోది: బాణభట్టుడి ‘‘హర్ష చరిత్రము’’ గ్రంథానికి తెలుగునాట కీర్తికెక్కిన తిరుపతి వేంకటకవులు ఆంధ్రీకరించిన గ్రంథాన్ని సంప్రదించాం. దీన్ని 1920లో శ్రీరామ విలాస ముద్రా రాక్షసశాలవారు ప్రచురించారు.

    Trending Stories

    Related Stories