జమ్మూ కశ్మీర్ లో ఇటీవల సాధారణ ప్రజలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి తీవ్రవాదులను అంతం చేయడమే పనిగా కేంద్ర భద్రతా బలగాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పాకిస్తాన్ కు సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో సమాధానం చెపుతామని అమిత్ షా హెచ్చరించారు. హాని తలపెట్టే వారితో కూర్చొని చర్చలు జరిపే రోజులు గతంలో ఉండేవని… ఇప్పుడున్నవి ఉగ్రదాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని అన్నారు. 2016లో భారత ప్రభుత్వం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ను ఆయన గుర్తు చేశారు. గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని అమిత్ షా చెప్పారు. ఈ దాడుల ద్వారా భారత సరిహద్దులకు ఎవరూ హాని కలిగించలేరనే సందేశాన్ని పంపామని అన్నారు.
అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు.. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయన్నారు అమిత్ షా. మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని స్ట్రైక్స్ తప్పవు.. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం చేయకూడదన్న గట్టి సందేశం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా వెళ్లింది. ఒకప్పుడు చర్చలు జరిగేవి.. కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టే సమయని అమిత్ షా అన్నారు.