తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మల్ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు వెయ్యి మంది ప్రజలు అమరులైన ప్రదేశం ఉందని, కాబట్టి నిర్మల్‌లో సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అమిత్ షా పర్యటనపై రెండు రోజుల్లో రాష్ట్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వం చర్చించే అవకాశం ఉందని.. ఆ తర్వాత పర్యటన ఖరారవుతుందని బీజేపీ సీనియర్ నేతలు తెలిపారు.
సెప్టెంబరు 17 నాటికి బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర కామారెడ్డికి చేరుకుంటుందని, ఆయన కూడా సభకు హాజరవుతారని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అమిత్ షా యాత్ర కన్ఫర్మ్ అయితే తెలంగాణ బీజేపీలో మరింత ఉత్సాహం రానుంది. ఇప్పటికే బండి సంజయ్ తన యాత్రతో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తూ ఉండగా.. అమిత్ షా తో బహిరంగ సభ నిర్వహిస్తే తెలంగాణలో బీజేపీ ఇంకాస్త పుంజుకునే అవకాశం లేకపోలేదు.