కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం పర్యటనకు రానున్నారు. ఈరోజు ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోన్నారు. అనంతరం అక్కడి నుంచే హెలికాప్టర్ లో శ్రీశైలంకు వెళ్లనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో ఆయన దర్శించుకుంటారు. దర్శనం పూర్తయ్యాక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని అంటున్నారు.
లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలంకు వస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలో అమిత్ షా రాక సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి రాక సందర్భంగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ అంతర్గతంగా అలర్ట్ కొనసాగుతుండొచ్చు. అమిత్ షాతో పాటుగా శ్రీశైలం ఆలయానికి ఆయన కుటుంబీకులు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనలో రాజకీయ కలయికలు ఉండక పోవచ్చనే అంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, కర్నూలు జిల్లా ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు శ్రీశైలంలో అమిత్ షాను కలవొచ్చని, కేంద్ర మంత్రికి స్వాగతం పలకడానికి ఏపీ ప్రభుత్వం కూడా మంత్రులను పంపే అవకాశం ఉండనుంది.