More

    కశ్మీర్ పర్యటనలో అమిత్ షా డేరింగ్ నిర్ణయం

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పాటూ జమ్మూ, కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే..! అక్కడ ఎన్నో సంక్షేమ పథకాలకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధే తమ లక్షమని చెప్పుకొచ్చారు. పర్యటనలో చివరి రోజు సోమవారం నాడు షేర్‌ ఈ కశ్మీర్‌ ఇంటర్నెషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సమావేశానికి ముందు అమిత్‌ షా ఒక డేరింగ్ పని చేశారు. వేదిక మీదకు ఎక్కి ప్రసంగించడానికి ముందు అమిత్‌ షా తన ముందు ఉంచిన బుల్లెట్‌ ప్రూఫ్‌షీల్డ్‌ని తొలగించారు. అమిత్‌ షా చేసిన పనికి అక్కడున్నవారంతా షాకయ్యారు. ఇక తన స్పీచ్ మొదలు పెడుతూ ‘నన్ను దూషించారు, అడ్డుకున్నారు. కానీ నేను జమ్మూకశ్మీర్‌ ప్రజలతో సూటిగా, స్పష్టంగా మాట్లాడాలనుకున్నాను. అందుకే బుల్లెట్‌ ప్రూఫ్‌ షీల్డ్‌, సెక్యూరిటీని తొలగించాను. ఫరూఖ్‌(అబ్దుల్లా) సాహెబ్‌ నన్ను పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. కానీ నేను కశ్మీర్‌ లోయలో ఉన్న యువత, ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు.

    ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం మరియు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినట్లు పార్లమెంటులో ప్రకటించిన మూడు సంవత్సరాల తర్వాత అమిత్ షా మూడు రోజుల పాటూ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. “ఆర్టికల్ 370 రద్దు వెనుక ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది – కశ్మీర్, జమ్మూ మరియు కొత్తగా ఏర్పడిన లడఖ్‌లను అభివృద్ధి పథంలో ఉంచడం. 2024 నాటికి మా ప్రయత్నాల ఫలాలను మీరు చూస్తారు” అని హోం మంత్రి అన్నారు.

    జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మరియు ఆపలేరని అమిత్ షా హామీ ఇచ్చారు. ఆదివారం నాడు జమ్మూలోని భగవతి నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని.. కశ్మీర్‌, జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయని, దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇది మాతా వెష్ణోదేవి ఆలయాల భూమి. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ త్యాగాల గడ్డ.. ఇక్కడ శాంతి, సామరస్యాలను దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రభుత్వ వారి ప్రయత్నాలను సాగనివ్వదు అని అన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 సంవత్సరాంతానికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమయిందన్నారు. లక్షలాది మంది ప్రజలను అన్యాయానికి గురి చేసిన, వివక్షా పూరితమైన ఈ ఆర్టికల్‌ అమలును రద్దు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు.

    Trending Stories

    Related Stories