మొదలైన అమిత్ షా కశ్మీర్ పర్యటన.. అప్పటి నుండి ఇదే మొదటిసారి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జమ్ముకశ్మీర్‌లో పర్యటన ఈరోజు మొదలైంది. శనివారం నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది.. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. అమిత్‌షా కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధికారులు కశ్మీర్ లోయలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. స్థానికేతరులు, మైనారిటీలపై ఇటీవల దాడుల నేపథ్యంలో కశ్మీర్ లోయను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో స్నిప్పర్స్, షార్ప్ షూటర్లను ఉంచారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉగ్రవాద దాడులను నియంత్రించేందుకు శ్రీనగర్‌లోని సిటీ సెంటర్ నుంచి లాల్ చౌక్ వరకు గగనతలంపైనా నిఘా పెట్టాయి.
మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. ఆయన రెండు రోజులు శ్రీనగర్‌లో, ఒక రోజు జమ్ములో గడపనున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో అమిత్‌షాకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నేరుగా నౌగాం చేరుకున్న అమిత్‌షా.. అక్కడ సీఐడీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ దార్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి జవాన్ పర్వేజ్ అహ్మద్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. పర్వేజ్ అహ్మద్ ధైర్యసాహసాలకు నాతో పాటు మొత్తం దేశం గర్వపడుతున్నదని అమిత్‌షా చెప్పారు. అతడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కశ్మీర్లో సాధారణ వ్యక్తులపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భద్రతా దృక్కోణంలో షా పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. రా చీఫ్ సమంత్ కుమార్ గోయెల్, సీనియర్ ఆర్మీ అధికారులు, ఐబీ చీఫ్‌తో పాటు 12 మంది భద్రతా ఉన్నతాధికారులతో రాజ్‌భవన్‌లో అమిత్‌షా ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నారు. కొన్ని ప్రాంతాలకు అమిత్ షా ఛాపర్ ద్వారా వెళ్లకుండా.. రోడ్డు మార్గంలోనే వెళ్లారు.