మహారాష్ట్ర, గుజరాత్‌లను విలవిలలాడించిన తౌక్త తుపానును మరిచిపోకముందే ‘యాస్’ తుపాను దూసుకొస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమిత్ షాతో మాట్లాడి పలు వివరాలు తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి లతో పాటూ ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ అధికారులు కూడా పాల్గొన్నారు.
అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రపై ‘యాస్’ తుపాను ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ చెప్పిన సంగతి తెలిసిందే..! తుపాను సహాయక చర్యలు, కొవిడ్ కార్యాచరణ నడుమ సమన్వయం అవసరమని కూడా జగన్ అధికారులకు చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరోనా రోగులను తరలించాల్సిన పరిస్థితులు వస్తే తక్షణమే ఆ పనిచేయాలని జగన్ సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని సూచనలను జారీ చేశారు. ఒడిశా తుపాను ప్రభావానికి గురైతే అక్కడి నుంచి వచ్చే ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయాలను ముందే సిద్ధం చేసుకోవాలని అన్నారు. తగినంత మేర ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్త పడాలని అన్నారు. ‘యాస్’ తుపానుతో కరోనా రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని.. సహాయక శిబిరాల్లో సౌకర్యాల లోటు ఉండకూడదని చెప్పారు.
సాంకేతిక సిబ్బంది సేవలు తీసుకుని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్లకు కూడా నిరంతరం విద్యుత్ అందించాలని తెలిపారు. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచాలని జగన్ సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నేడు తుఫానుగా మారి, రేపు తీవ్ర తుపానుగా మారనుంది. మే 26 సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపాల మధ్య ఇది తీరం దాటుతుందని.. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. యాస్ తుపాను ప్రభావంతో సోమవారానికి మధ్య బంగాళాఖాతంలో గంటకు 65 – 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటే దాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు.
యాస్ పేరును ఒమన్ దేశం ప్రతిపాదించింది. పర్షియా భాషలో యాస్ అంటే సువాసన వెదజల్లే మొక్క అని అర్థం. ఇంగ్లీష్‌లో దీనికి జాస్మిన్ అని అంటారు. జాస్మిన్ అంటే మల్లెపూలని తెలిసిన విషయమే. యాస్ అంటే మల్లెపూల మొక్క అనుకోవచ్చు. ఈ తుపాను ప్రభావంతో ఏపీలో నేడు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.