సాయి గణేష్ కుటుంబానికి అండగా ఉంటామన్న అమిత్ షా

0
785

సాయి గణేష్.. కొద్దిరోజుల కిందట ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త. సాయి గణేశ్‌ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు.సాయిగణేశ్‌ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయిగణేశ్‌ అమ్మమ్మ సావిత్రి, సోదరితో మాట్లాడి యువకుడి మృతిపై సంతాపం తెలిపారు. తమకు న్యాయం చేయాలని అమిత్‌షాను కుటుంబీకులు కోరారు. పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

అక్రమ కేసులతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ సాయిగణేశ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సాయి గణేష్ మృతిపై సీబీఐ విచారణ జరపించాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన సాయి గణేష్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ నెల 14న పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సాయి గణేష్ పురుగుల మందు తాగాడు. మొదట సాయి గణేష్ ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా… మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రెండ్రోజుల పాటు చికిత్స అందించినా సాయి గణేశ్‌ పరిస్థితి మెరుగవ్వలేదు. చికిత్స పొందుతూనే సాయిగణేశ్​ ప్రాణాలు విడిచాడు. వచ్చే నెల 4న అతడి పెళ్లి జరగాల్సి ఉంది: సాయిగణేష్ మృతితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మంలో ఆందోళనకు దిగారు. సాయిగణేశ్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. సాయిగణేష్‌ను పోలీసులు, అధికార పార్టీ నేతలు తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు.