కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం నాడు తెలంగాణకు రానున్నారు. నిర్మల్ లో ఆయన పర్యటించనున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులు అర్పించిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో తెలంగాణ విమోచన సభలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిర్మల్ సభ కోసం బండి సంజయ్ పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చారు. పాదయాత్రలో తనతో వెంట నడుస్తున్న 300 మంది కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి నేరుగా నిర్మల్ బహిరంగసభ వేదికకు చేరుకుంటారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్మల్‌లో భారీ సభకు ఏర్పాట్లు చేసింది. రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల ప్రాణత్యాగాల చరిత్రను దేశానికి తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ చెబుతోంది.
అమిత్‌షా షెడ్యూల్:
ఉదయం 9.25 నిముషాలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బీఎస్‌ఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్ విమానాశ్రయంలో దిగుతారు
12 గంటలకు నాందేడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ముద్ఖేడ్ సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటాక ముద్ఖేడ్‌లోనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత ముద్ఖేడ్ నుంచి హెలికాప్టర్‌లో నిర్మల్‌కి చేరుకుంటారు.
హెలిప్యాడ్ నుంచి కారులో బహిరంగ సభాస్థలి నిర్మల్ క్రషర్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. సభాస్థలి ప్రాంగణంలోనే ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు.
మాజీ ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు.
ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 గంటల సమయంలో నిర్మల్ నుంచి హెలికాప్టర్‌లో నాందేడ్‌కు తిరుగు ప్రయాణమవుతారు
రాత్రి 8 గంటల సమయంలో నాందేడ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బీఎస్ ఎఫ్ విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.