National

శాంతి, సామరస్యాలను దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం: అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూ కశ్మీర్ లో ఉన్నారు. అమిత్ షా ఆదివారం నాడు మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగించడాన్ని అసలు సహించమని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మరియు ఆపలేరని హామీ ఇచ్చారు. జమ్మూలోని భగవతి నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని.. కశ్మీర్‌, జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయని, దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇది మాతా వెష్ణోదేవి ఆలయాల భూమి. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ త్యాగాల గడ్డ.. ఇక్కడ శాంతి, సామరస్యాలను దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రభుత్వ వారి ప్రయత్నాలను సాగనివ్వదు అని అన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 సంవత్సరాంతానికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమయిందన్నారు. లక్షలాది మంది ప్రజలను అన్యాయానికి గురి చేసిన, వివక్షా పూరితమైన ఈ ఆర్టికల్‌ అమలును రద్దు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాలవారు ఇక్కడ భూములు కొనుక్కునేందుకు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అవకాశం లభించిందన్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఇక్కడ పంచాయతీలకు, సమితులకు, జిల్లా అభివృద్ధి మండళ్లకు తొలిసారి ఎన్నికలు నిర్వహించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ఇకపై జమ్మూ కశ్మీర్‌లో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావచ్చని అన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం రెండో రోజు జమ్మూలో రూ.210 కోట్లతో నిర్మించిన ఐఐటీ క్యాంప్‌సను ఆయన ప్రారంభించారు. అనంతరం జమ్మూలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అంతకుముందు భగవతినగర్‌లో నిర్వహించిన సభలో అమిత్‌ షా మాట్లాడారు. జ‌మ్ము విమానాశ్ర‌య విస్త‌ర‌ణ‌తోపాటు ప్ర‌తి జిల్లా కేంద్రానికి హెలికాప్ట‌ర్ సేవ‌లు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌శ్మీర్‌లోయ‌లో మొద‌లైన అభివృద్ధిని ఎవ‌రూ నిలువ‌రించ‌లేరని.. స్థానిక యువ‌కులు జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌గ‌తికి స‌హ‌క‌రిస్తే ఉగ్ర‌వాదాన్ని క‌ట్ట‌డి చేయొచ్చున‌న్నారు. అభివృద్ధి ప‌నుల‌కు విఘాతం క‌లిగించే శ‌క్తుల ఆట‌లు సాగ‌నివ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

Related Articles

Back to top button