ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని మంత్రులు అన్నారు.
మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతికి తన మద్దతు ప్రకటించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా ఏపీ నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజలు సాధించిన విజయమని అన్నారు. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రఘురామ తాజాగా వీడియోలో చెప్పుకొచ్చారు. మళ్ళీ మూడు కాదు రెండు అని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలా చేయాలనుకున్నారో అలా చేయాలని.. లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు. జై అమరావతి.. జై జై అమరావతి అని సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోను ముగించారు రఘురామ.
మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ ను ఓవైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే హైకోర్టులో దాఖలు చేశారు. బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి కొత్త బిల్లును సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు.