కొత్త కో ఆపరేటివ్ విధానాన్ని తీసుకుని వస్తున్నాం: అమిత్ షా

0
682

కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఎన్నో మార్పులతో కొత్త సహకార(కో ఆపరేటివ్) విధానాన్ని తీసుకువస్తుందని.. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త విధానం అమలు చేయబడుతుందని చెప్పారు. దేశ అభివృద్ధిలో స‌హ‌కార మంత్రిత్వ శాఖ అద్భుత సామ‌ర్ధ్యంతో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ స‌హ‌కార స‌ద‌స్సును ఉద్దేశించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, మొత్తం నెట్‌వర్క్‌లోని అన్ని ముఖ్యమైన యూనిట్లు త్వరలో కంప్యూటరీకరించబడుతాయని అమిత్ షా తెలిపారు. సహకారం అనేది రాష్ట్ర విషయం అని చాలా మంది అంటుంటారు, అయితే రాష్ట్రాలతో మాకు ఎలాంటి గొడవలు ఉండవని అన్నారు. పేదరిక నివారణలో రాష్ట్రాలతో కలిసి పని చేస్తూ ఉంటామని, సహకార సంఘాల విషయంలో సహాయం చేస్తామని అన్నారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల వేళ నూత‌న స‌హ‌కార విధానాన్ని తీసుకువ‌స్తున్నామ‌ని ఇది గ్రామీణ స‌మాజాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో స‌హ‌కార సంస్ధ‌లు ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు ఎదిగేందుకు స‌హ‌కార వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు , జిల్లా సహకార బ్యాంకులు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ఇతర ముఖ్యమైన ఆర్థిక సంస్థలు కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌తో అప్డేట్ చేయబడుతాయని ఆయన చెప్పారు. దేశంలోని మత్స్యకారుల కోసం వారి వ్యాపారంలో అనేక విధాలుగా సహాయపడే కొత్త సహకార సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సహకార క్రెడిట్ సౌకర్యాన్ని మరింత సరళీకృతం చేయాల్సి ఉందని అన్నారు అమిత్ షా. ఈ దేశంలో చాలా మందికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి చిన్న రుణాలు అందడం లేదని, వారి వద్ద పేపర్ లేదా తనఖా పెట్టడానికి ఏదీ లేకపోవడంతో కష్టపడుతూ ఉన్నారని.. ఈ సహకార సంస్థలు అలాంటి వారి ఆందోళనను పరిష్కరిస్తాయని అన్నారు.

పేదల విప్లవానికి కొత్త దిశానిర్దేశం చేసే పనిని ఇఫ్కో(IFFCO) చేసిందని అమిత్ షా చెప్పారు. దేశంలో దాదాపు 91% గ్రామాలలో చిన్న, పెద్ద సహకార సంస్థలు ఉన్నాయని అమిత్ అన్నారు. 91% గ్రామాల్లో సహకార సంఘాలు ఉన్న దేశం ప్రపంచంలోనే ఎక్కడ ఉండదని అన్నారు. విపత్తులు సంభవించినప్పుడు.. సహాయం చేయడానికి సహకార సంఘాలు ముందుకు వచ్చాయని చెప్పారు. సహకార సంఘాలు అనేక ఒడిదుడుకులు చూశాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకురావడమే సహకార మంత్రిత్వ శాఖ లక్ష్యమని అన్నారు. 2009-10లో వ్యవసాయ బడ్జెట్ రూ .12,000 కోట్లు ఉండగా మోదీ ప్రభుత్వంలో 2020-21 నాటికి రూ .1,34,499 కోట్లకు పెరిగిందని తెలిపారు.

సహకార సంఘాలు దేశ అభివృద్దిలో ముఖ్యమైన సహకారం అందించగలవని అమిత్ షా అన్నారు. 2025 కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సహకార రంగం కూడా కృషి చేస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మెగా సదస్సులో 2,000కు పైగా సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.