తెలంగాణలో ‘షా’ మార్క్ చాణక్యం..!
భారీ వ్యూహానికి తెరలేపిన బీజేపీ..!!

0
747

పంజాను బట్టి పులిని పోల్చుకోవాలని సామెత. అన్ని పులులూ దాడికి తెగబడవు. కొన్ని మనిషి అయిపు కనిపిస్తే పారిపోతాయి. కొన్ని పనిగట్టుకుని, వాసన పసిగట్టి…మాటువేసి మీదకు తెగబడతాయి. తెలంగాణలో రాజకీయ దాడికి దిగిన పులి సంచారం స్పష్టంగానే తెలుస్తోంది. దాని పేరు భారతీయ జనతాపార్టీ. ఇంతకాలం బీజేపీ అనే పులి సంచారం సుదూరంలో ఉండేది కాబట్టి భయం తాలూకు ఛాయలు అంతగా కనబడేవి కావు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం పంజాను పోల్చుకోకుండా పులిని నిలువరించాలనే విఫలయత్నం చేస్తోంది.

బండి సంజయ్ నల్లగొండ ధాన్యం మార్కెట్ సందర్శన సందర్భంగా జరిగిన దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందనే స్పృహ అధికార పార్టీకి ఉన్నట్టుగా లేదని దాఖలాలు చూస్తే అనిపిస్తోంది. యుద్ధం మొదలు పెట్టడంలో చాలా మెలకువ అవసరం. ఆ మెలకువ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించారు. ఆరు ముక్కలు చేస్తానని బండి సంజయ్ కి హెచ్చరిక జారీ చేశారు.

హుజురాబాద్  ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వస్తున్న మార్పులేంటి? కేసీఆర్ రెండు ప్రెస్ మీట్లలో ధ్వనించిన అసహనం, ఆగ్రహం, ఆందోళనల వెనుక ‘ఊహకందని పరివర్తన’ తాలూకు క్రీనీడ ఏదైనా ఆవిష్కృతమవుతుందా? ధాన్యం మార్కెట్లను సందర్శిస్తున్న బండి సంజయ్ పై దాడులు చేయడం వల్ల అంతిమంగా ఎవరికి ప్రయోజనం? అమిత్ షా తాజాగా తెలగాణలో అనుసరించనున్న ‘‘EUPHORIC CHANGE STRATEGY’’లో ఏముంది? గతంలో ఏపీలో చంద్రబాబును దెబ్బకొట్టేందుకు అనుసరించిన వ్యూహాన్నే కేంద్ర బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అనుసరిస్తుందా?

దుబ్బాక ఉప ఎన్నికతో పోలిస్తే హుజురాబాద్ బైపోల్ గుణాత్మకంగానే భిన్నమైంది. సరికొత్త రాజకీయ సమీకరణకు మార్గం సుగమం చేసేందుకు పాదులు వేసింది. రాజకీయ వాతావరణంలో తుపాను సృష్టిస్తుందనీ…అది సూపర్ సైక్లోన్ గా మారుతుందని ముసురుకుంటున్న మేఘాలు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ప్రతిష్ఠగా తీసుకోవడం వల్ల హుజురాబాద్  ఉపపోరు ఓటమి కేసీఆర్ లోని అహాన్నికకావికలం చేసింది. దీంతో ముఖ్యమంత్రి గారి మాట అదుపు తప్పింది.

అది ఆయనలోని రాజకీయ పరిణతిపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, హేమాహేమీలను ఢీకొన్న గతం, పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొక్కవోని దీక్ష ఉన్న కేసీఆర్ కేవలం ఒక ఉప ఎన్నికలో గెలిచిన బీజేపీపై అంత తీవ్ర స్వరంతో ఎందుకు విరుచుకుపడ్డారన్న సందేహం రావడం సహజం.

కేసీఆర్ లక్ష్యం కేవలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రమేనా? లేదా బీజేపీ క్రమంగా పోటీదారుగా మారుతోందన్న భయం వల్ల కలిగిన ఆందోళనా? లేదూ ప్రతిష్ఠగా తీసుకున్న ఉప ఎన్నికలో పార్టీ ద్రోహిగా, దళితుల భూమి ఆక్రమణదారుగా ప్రకటించిన మాజీ సహచరుడి గెలుపు కలిగించిన అసహనమా? లేకపోతే ‘దళిత బంధు’ లాంటి సంచలన సంక్షేమ పథకాన్ని ప్రకటించినా హుజురాబాద్ ఓటర్లు నమ్మలేదన్న ఆగ్రహమా? అంటే ఈ మూడింటి మేలు కలయికే కేసీఆర్ రెండు ప్రెస్ మీట్లలోని సారం.

రెండు ప్రెస్ మీట్లలో కేసీఆర్ మాటతీరును, మాటల్లోని అంతరార్థాన్నీ, భాషనూ, హావభావాలను జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ రాజకీయ భవిష్యత్తు లీలగా రూపుగడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణాత్మకంగా బలమైన సంస్థ కాదు. మందబలం దండిగా ఉంది. దాంతోపాటు పద్ధతిగా, ప్రణాళిక బద్ధంగా, వ్యూహాత్మకంగా తమ తమ స్థానాలను కచ్చితంగా దక్కించుకోగలమన్న విశ్వాసం ఉన్న శాసన సభ్యుల సంఖ్య ఒకటీ రెండుకు మించి ఉండదు.

ఈ విషయం కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు. అందుకే కేవలం తన చాతుర్యంతో మాత్రమే వారిని గట్టెక్కించాలన్న పట్టుదల కేసీఆర్ లో స్పష్టంగానే కనిపిస్తుంది. అంత పకడ్బందీ ప్రణాళిక ఉన్న నేతలు ఒకవేళ తనవెంట ఉన్నా కేసీఆర్ ససేమిరా అంగీకరించరు. వెన్నుముక ఉన్నవారంటే వారికి గిట్టదు. విధేయతను మించిన ‘రాజభక్తి’ ఉన్నఅనుచర గణాన్ని మాత్రమే తన ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

వారిని  ఏదో ఒక మాయచేసి, తన మాట చాతుర్యంతో గెలిపించి తీరతానన్న ధైర్యం, గెలిపించాలన్న తాపత్రయం  కేసీఆర్ లో కనిపిస్తుంది. ఈ స్థితి బలం, బలహీనత కూడా. ఈ విషయం సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు.

బలమైన ప్రత్యర్థి మైదానంలోకి దిగనంత వరకు.. ఎంతటి బలహీన వ్యూహాలైనా అద్భుతమైన విజయాలు సాధిస్తాయి. వైరి కాలుమోపిన తర్వాత బలమైన వ్యూహాలు సైతం పాలిపోతాయి. అందుకే కేసీఆర్ లో సందేహంతో కూడిన భయం తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మట్టికొట్టుకు పోయింది. అందుకు సీఎం కేసీఆరే కారణం. మరికొంత హస్తం స్వయంకృతం. ఇక చేతిగుర్తు బతికి బట్టకట్టే ఆశలేదని హుజురాబాద్ ఉప ఎన్నిక రుజువు చేసింది.

ఇక బండి సంజయ్ ధాన్యం మార్కెట్లను సందర్శిస్తుండగా చేస్తున్న రాళ్లు దాడులు ఎవరికి ఉపయోగకరం అనే ప్రశ్న అత్యంత ప్రధానమైంది. మందీ మార్బలంతో టీఆర్ఎస్ హడావిడి సృష్టించవచ్చు కానీ, బీజేపీ బలపడుతోందన్న భావన స్థిరపడే ప్రమాదాన్ని కేసీఆర్ పసిగట్టకపోవడమే ఆశ్చర్యకరం. బీజేపీ నల్లగొండనే ఎందుకు మొదట తన సందర్శనకు కేంద్రంగా ఎంచుకుందనే అంశాన్ని కూడా ఆలోచించాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ కు బలమైన కేంద్రం. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అయితే బీజేపీ కూడా సుమారు రెండు దశాబ్దాలుగా నల్లగొండలో తనకంటూ ఒక బేస్ ను కలిగి ఉంది.

నల్లగొండను ఎంచుకుంటే టీఆర్ఎస్ తన పర్యటనపై దాడికి దిగుతుందన్న అంచనా ఉన్నందుకే బండి పర్యటన అక్కడి నుంచి మొదలు పెట్టినట్టున్నారు. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగాయి. రోజంతా మీడియా చేసిన హడావిడి ప్రత్యక్ష ప్రసారం రూపంలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్శించింది. ఇది ఇట్లాగే కొనసాగితే టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమవుతోందన్న సంకేతాలు వెలువడక తప్పదు. ప్రజల్లో కూడా టీఆర్ఎస్ కు దీటైన శక్తి క్రమంగా బలపడుతోందన్న భావన క్రమంగా బలపడుతుంది. ఇది అధికార పార్టీకి ఏమంత శ్రేయస్కరం కాదు.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ రాజకీయ వ్యూహకర్త అమిత్ షా సరికొత్త వ్యూహం-ఎత్తుగడలు రూపొందించినట్టూ సమాచారం. అందుకే హుజూరాబాద్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచీ ఫలితాలు వెలువడే వరకూ నిరంతరం ఈటల రాజేందర్ తో పరిస్థితి తెలుసుకున్నట్టూ అర్థమవుతోంది. అంటే హుజురాబాద్ ఉపపోరును తదుపరి వ్యూహానికి లాంచ్ ప్యాడ్ గా ‘షా’ భావిస్తున్నట్టూ సంకేతాలు వెలువడుతున్నాయి. కేవలం ఒక ఉప ఎన్నిక విషయం కేంద్ర హోం మంత్రి ఎందుకంత శ్రద్ధ తీసుకున్నారు అనే ప్రశ్న వేసుకుంటే సందేహం నివృత్తి అవుతుంది.  

తెలంగాణ విషయంలో అమిత్ షా అనుసరిస్తున్న ‘‘EUPHORIC CHANGE STRATEGY’’లో ఏముందో చూద్దాం…

‘Euphoric change’ అంటే ‘‘Promising aggressive change that represents a leap forward to some desired future’’ అన్నది దాని మూల సూత్రం. అంటే గెంతులాంటి తీవ్రమైన మార్పును ఆశావహం చేయడం, వాంఛనీయమైన భవిష్యత్తును వాగ్దానం చేయడం’’ అన్నమాట. ‘Euphoric change’ అనే వ్యూహం అత్యంత ప్రధానమైన 14 రాజకీయ వ్యూహాల్లో ఒకటి. పరిస్థితికి అనుగుణంగా ఒక్కో వ్యూహాన్ని రాజకీయ పక్షాలు ఆశ్రయిస్తుంటాయి.

ఎందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయంటే…బలమైన పార్టీ నిర్మాణం ఉండి, శ్రేణులు సన్నద్ధంగా ఉన్నచోట, అధికార పక్షం ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని రూఢీ చేసుకున్న తర్వాత ఈ వ్యూహాన్ని అనుసరించి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోవడం ఇందులో ప్రధానమైంది. ఈ వ్యూహం చాలా సత్ఫలితానిచ్చిందని ఎన్నికల చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది.

ఈ వ్యూహం ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజకీయ స్థితిని అంచనా వేద్దాం. తెలంగాణలో బీజేపీ ఇటీవలి కాలంలో బలపడింది. సాధారణ ఎన్నికల్లో 4 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్, కేసీఆర్ తనయి కవితలను ఓడించి సవాలు విసిరింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఆబ్బురపరిచే విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వెనువెంటనే జరిగిన జీహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్ల నుంచి ఏకంగా 44 స్థానాలను కైవసం చేసుకుంది.

ముందస్తు పథకం ప్రకారం ప్రచారాన్ని లంకించుకుని,  కేబినెట్ నుంచి ఈటలను బర్తరఫ్ చేసి ఉప ఎన్నికను అనివార్యం చేశారు కేసీఆర్. సాధారణ ఎన్నికల స్థాయిలో ఉత్కంఠను రేపిన ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ స్థితిలో ‘Euphoric change’ వ్యూహాన్ని అనుసరిస్తే విజయం తప్పనిసరని అమిత్ షా భావిస్తున్నారని సమాచారం. నిజంగా ఈ వ్యూహాన్నే పకడ్బందిగా అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ చేసింది. అప్పుడు ఏపీ నిఘా బృందాలు తెలంగాణలో తిరిగి సర్వేలు చేశాయి. ఈ విషయాన్ని సాక్షి పత్రి వార్తగా కూడా ప్రచురించింది. ఆ తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల సంద్భంలో చంద్రబాబు గెలుపు అవకాశాలు తెలుసుకునేందుకు తెలంగాణ ఇంటెలీజెన్స్ వర్గాలు ఏపీలో సంచరించాయి.

దీని వెనుక అమిత్ షా ఉన్నారన్న వదంతులూ ఉన్నాయి. సరిగ్గా ఇదే పద్ధతిని తెలంగాణ ఎన్నికల విషయంలో వాడాలని భావిస్తున్నట్టూ సమాచారం. తెలంగాణలో రాజకీయ పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ నిఘా బృందాలను దించే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో రాజకీయ అగ్గి ఏడాదిన్నర ముందే రాజుకుంది. ప్రతిపక్షమే లేని స్థితి ఉన్నచోట బహుముఖ పక్షాలు పాగా వేశాయి. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ గెలుపోటములకన్నా ఓట్లను చీల్చే అవకాశాలే బలంగా ఉన్నాయి. షర్మిల నేతృత్వంలోని తెలంగాణ వైసీపీ కూడా ఓట్ల చీలికకు కారణం కావచ్చు. కాంగ్రెస్ ఓట్ల చీలిక సరేసరి. ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, పెరిగిన బీజేపీ బలం….ఎలాంటి అంతిమ తీర్పుకు కారణమవుతాయి? ఈ ప్రశ్నకు భవిష్యత్తే జవాబు చెప్పాలి.  అధికారం దౌడు తీస్తున్నపుడు చూపు మసకబారే ప్రమాదం ఉంది. వైరి తవ్విన కందకాలు కనిపించని వేగం అంత శ్రేయస్కరం కాదని అధికార టీఆర్ఎస్ గుర్తించాలి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here