Telugu States

2024లో అధికారికంగా తెలంగాణ విమోచన దినం: అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం నాడు నిర్మల్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్‌ షా అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్‌ షా అన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల వరకూ తెలంగాణకు విముక్తి లభించలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ పరాక్రమం వల్లే నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటపడిందని అమిత్‌ షా అన్నారు. నిర్మల్ ఆదివాసులు మొదట బ్రిటిషర్లు, ఆ తర్వాత నిజాంలతో పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విమోచన దినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేస్తున్నానన్నారు.

1948 సెప్టెంబర్ 17న నిజాం అరాచకపాలన సంకెళ్లు తెగి తెలంగాణకు విముక్తి లభించి, భారత్‌లో భాగమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చేయలేకపోతోందని అమిత్‌ షా ప్రశ్నించారు. అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, సీఎం కేసీఆర్‌‌ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని.. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2024లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్‌ షా చెప్పారు.

తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ సీట్లనూ గెల్చుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో పాదయాత్ర చేసేవాళ్లను చూశాం. కానీ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం బండి సంజయ్ సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. మజ్లిస్‌‌కు భయపడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోందని అన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, మహిళల కోసమే ఈ సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు చెప్పాలని.. 119 నియోజకవర్గాల ప్రజల్లో చైత్యన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రతి ఎన్నికలు డబ్బుతో గెలవొచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. సేవ చేసేవాళ్లు కావోలో.. డబ్బుల రాజకీయం చేసే వారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అమిత్ షా అన్నారు.

అమిత్ షా నిర్మల్ సభ మొత్తం ఈటల రాజేందర్ పేరు అమిత్ షా ప్రస్తావిస్తూనే ఉన్నారు. రెండో వరుసలో కూర్చున్న ఆయనను వేదికపై ముందుకు పిలిచి మరీ మాట్లాడారు.సభ ప్రారంభంలోనే అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఈటల రాజేందర్ పేరు పలికారు. వెంటనే ఈటల లేచి నిలబడగా ‘ముందుకు రాజేందరన్న’ అంటూ అమిత్‌ షా పిలిచారు. ఈటల కోసం ప్రత్యేకంగా చప్పట్లు కొట్టించారు. ‘రాజేందర్‌ ఎన్నిక వస్తోంది. రాజేందర్‌ను గెలిపిస్తున్నాం కదా! వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం కదా’ అని అమిత్‌ షా వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించి.. రాష్ట్రంలో ఉన్న డబ్బుల రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ఈటల మాట్లాడుతూ యావత్ తెలంగాణ తన వెంట ఉందన్నారు. హుజురాబాద్ లో ఎప్పుడూ ఎన్నిక వచ్చిన కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశాన్ని బీజేపీ గొప్పగా పాలిస్తుందన్నారు ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర్య దినం జరుపుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందన్నారు ఈటల.

ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ తెలంగాణ నేల అంటేనే పౌరుషాల గడ్డ అని అన్నారు. ఇలాంటి పోరాటాల గడ్డపై కేసీఆర్ నిర్బంధపు పాలన చేద్దామనుకుంటున్నారని.. అయితే నిర్బంధాలకు భయపడే నేల ఇది కాదన్నారు. రామదాసును గోలకొండలోని జైలులో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయారని చెప్పారు. కానీ భయపడలేదన్నారు. అలాగే కవి దాశరథిని నిజామాబాద్ ఖిల్లా జైలులో బందీ చేస్తే మహాకవి దాశరథిగా.. తెలంగాణను కోటి రతనాల వీణగా మారుమోగించారని పేర్కొన్నారు. కేసీఆర్ చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోందన్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ నిర్మల్‌ గడ్డమీద వెయ్యి మందిని ఉరితీశారని గుర్తు చేశారు. నిర్మల్‌లో ఉరితీసిన వెయ్యి మంది యోధుల చరిత్రను చెప్పడానికే ఇక్కడ సభ నిర్వహిస్తున్నామన్నారు. వాళ్లంతా ఇప్పుడు పైనుంచి మనల్ని చూస్తున్నారని, వాళ్లకోసం మనమంతా నినదించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడు ప్రధాని అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరపడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి కుటుంబాన్ని కూకటి వేళ్ళతో పెకిలివేస్తామని స్పష్టం చేశారు. అమరుల త్యాగాలతో పాటు కేసీఆర్ క్రూరత్వాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు. మోదీ, అమిత్ షా లేని దేశాన్ని ఉహించుకోలేమని.. అవకాశం ఉంటే నా ఆయుష్ కూడా వారికే ఇస్తానని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మహానుభావుడు అమిత్ షా అని అన్నారు బండి సంజయ్. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

three × four =

Back to top button