More

    అమిత్ షా తెలంగాణ టూర్ కన్ఫర్మ్

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా అమిత్ షా తెలంగాణ టూర్ కన్ఫర్మ్ అయ్యింది. సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రానున్నారని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పారు. అమిత్ షా రాక కారణంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్రకు చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు. సంజయ్ పాదయాత్ర ఇప్పటికే 100 కిలోమీటర్లు దాటింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పాదయాత్రకు ఆయన బ్రేక్ ఇవ్వనున్నారు. నిర్మల్ లో జరిగే తెలంగాణ విమోచన సభకు వెళ్లనున్నారు. నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గర బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

    బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. అక్కడ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని అన్నారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని మండిపడ్డారు. దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్ దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు.

    భారీ వర్షాలకు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదలకు ఇళ్ళు మునిగిపోయి ఆస్తి నష్టం జరగడం విచారకరమన్నారు. కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల పట్టణంలో ముంపునకు గురైన కాలనీలు, బస్తీల పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ లు, ఇతర అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని కోరారు. ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    Related Stories