ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు కాస్త ఎక్కువైన సంగతి తెలిసిందే..! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం నాడు లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)కి చెందిన అనుమానిత కార్యకర్తల నివాసాలపై దాడులు నిర్వహించింది. లోయలో బయటి వ్యక్తులపై ఇటీవల జరిగిన దాడుల వెనుక జైషే మహ్మద్‌తో పాటు లష్కరే కు చెందిన అనుబంధ సంస్థ, ది రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
NIA ప్రకారం, 11 ప్రదేశాలలో సోదాలు జరిగాయి. శ్రీనగర్‌లోని ఆరు, బారాముల్లా (2), అవంతిపోరా (1), బుద్గామ్ (1) మరియు కుల్గామ్ (1) లలో సోదాలు జరిగాయి. సజాద్ గుల్, TRF కమాండర్ అనుచరులు జమ్మూ కశ్మీర్ యువకులను రాడికలైజ్ చేయడం / రిక్రూట్ చేయడం / ప్రేరేపించడం వంటి అనే ఆరోపణలపై అధికారులు సోదాలను నిర్వహించారు. సెర్చ్ చేసిన ప్రదేశాలలో ఉగ్రవాది బాసిత్ అహ్మద్ దార్ ఇల్లు కూడా ఉంది, అతనిపై NIA ఇటీవల రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది.
“ఈ కేసు లష్కరే తోయిబా (LeT) యొక్క ఫ్రంటల్ అవుట్‌ఫిట్ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) కార్యకలాపాలకు సంబంధించినది. జమ్మూ కశ్మీర్ యువకులను తీవ్రవాదులుగా మార్చడం, హింసకు పాల్పడేలా ప్రేరేపించడం, రిక్రూట్ చేయడం వంటి పనులకు కమాండర్ సజ్జాద్ గుల్ బృందం ప్రయత్నిస్తోంది. యువకులతో దాడులకు పాల్పడేలా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు” NIA ఒక ప్రకటనలో తెలిపింది.
సజ్జాద్ గుల్ పాకిస్తాన్‌లో ఉన్న LeTకి చెందిన ఇతర కమాండర్‌లతో కలిసి ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ ను రిక్రూట్ చేస్తున్నారు. పలు ప్రాంతాలపై అవగాహన తెచ్చుకొని అందుకు తగ్గట్టుగా దాడులకు తెగబడుతూ ఉన్నారు. LeT, TRFలకు మద్దతుగా ఆయుధాలను సమన్వయం చేయడానికి పలువురు యువకులను రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారని ఏజెన్సీ పేర్కొంది. ఈ సోదాలు చేసిన సమయంలో, ఏజెన్సీ బృందం డిజిటల్ పరికరాలు, SIM కార్డ్‌లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, డాక్యుమెంట్‌లు మొదలైన అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నాన్ లోకల్స్ ను, లోయలోని కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకునే పనిని TRF, JeM యొక్క ఓవర్‌గ్రౌండ్ కార్మికులకు అప్పగించినట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. వీరు పెద్దగా శిక్షణ పొందని పార్ట్-టైమ్ మిలిటెంట్లు, వారు సాధారణ జీవితం జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పై నుండి సూచనలు వస్తూ ఉంటాయో.. అప్పుడు చిన్న చిన్న దాడులను అమలు చేయగలరు. గత కొద్దీ రోజుల్లో ఇలాంటివి నాలుగు దాడులు జరిగాయి. ఇందులో ఆరుగురు వలస కార్మికులు, ఒక కాశ్మీరీ పండిట్ పై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గత ఏడాది అక్టోబరులో అనేక మంది వలస కార్మికులు, కశ్మీరీ పండిట్‌లు మరణించిన సమయంలో లోయలో చివరిసారి ఇటువంటి సంఘటనలు జరిగాయి. హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగిన ఈ సంఘటనలు లోయ నుండి నాన్ లోకల్స్ తిరిగి స్వస్థలాలకు వెళ్ళిపోడానికి, పండిట్ల వలసలకు దారితీశాయి.