ఫిబ్రవరి 16 వరకూ స్కూల్స్, కాలేజీలు మూసివేత.. క్లాసెస్ ఆన్ లైన్ లోనే..!

0
979

హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పీయూ, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా కాలేజీలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డీసీటీఈ) పరిధిలోని కాలేజీలకు ప్రకటించిన సెలవును పొడిగించినట్లు కర్ణాటక ప్రభుత్వంతెలిపింది. ఫిబ్రవరి 16 వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సంస్థలను ఆదేశించింది.

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల బురఖాపై చర్చ తీవ్ర రూపం దాల్చడంతో.. మూడు రోజుల పాటు కర్ణాటకలోని అన్ని ఉన్నత పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫిబ్రవరి 8న ఆదేశించిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదం నియంత్రణలో లేకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండటంతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ పరిధిలోని కళాశాలలకు సెలవును పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 16, బుధవారం వరకు విద్యా సంస్థలు మూసివేయనున్నారు. కేసు పరిష్కారమయ్యే వరకు విద్యార్థులు హిజాబ్ లేదా మతపరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర నిర్ణయాన్ని అనుసరించాలని కర్ణాటక ప్రభుత్వం జిల్లా డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించింది.

పరిస్థితిని అంచనా వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిప్యూటీ కమిషనర్లు (డిసిలు), పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు), పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ (డిడిపిఐలు), జిల్లా పంచాయతీల సిఇఓలతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలు పరిరక్షించాలని, బయటి కవ్వింపు చర్యలను నిరోధించడానికి కృషి చేయాలని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 10న, కర్ణాటక హైకోర్టు హిజాబ్ నిషేధం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పరిష్కారమయ్యే వరకు మతపరమైన దుస్తులు ధరించరాదని విద్యార్థులను కోరింది. రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి తమ ప్రవేశాన్ని నిషేధించారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుండగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్ణాటకలోని ఉడిపి, శివమొగ్గ, బాగల్‌కోట్‌ తదితర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల వద్ద హిజాబ్‌ వ్యవహారంపై ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలపై రాళ్లు రువ్వడం ప్రారంభించిన గుంపును అణిచివేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ను ప్రయోగించారు.