More

    విదేశాల్లో ఖలీస్తాన్ వేర్పాటువాదుల విధ్వంసం.. అమెరికా తీవ్ర ఆగ్రహం..!

    ఖలీస్తాన్ వేర్పాటువాదులు భారత్ కు పెను ముప్పులా మారుతున్నారు. వారి అరాచకాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. దేశంలో సృష్టిస్తున్న విధ్వంసం ఒక ఎత్తు ఐతే.. ఇతర దేశాల్లో సైతం భారత్ ను అవమానిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. భారత్ లోని పంజాబ్ లో ఖలిస్థాన్ వేర్పాటువాదుల వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలతో అమెరికా, యూకే సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొలో భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు.

    అలాగే అంతకుముందు లండన్​లో భారత త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. ఖలిస్థాన్‌ అనుకూలవాదులు కొందరు ఈ ఘటనకు ఒడిగట్టారు. లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండా ను కిందికి దింపివేశారు. ఈ సంఘటనపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

    భారత హైకమిషన్ వద్ద కిటికీని పగులగొట్టారనే అనుమానంతో లండన్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ది గార్డియన్ నివేదించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘటనల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలతో ఖలిస్తాన్ మద్దతుదారుల బృందం భారత జెండాను కిందకు దించిన తర్వాత లండన్‌లోని భారత హైకమిషన్ భారీ త్రివర్ణ పతాకంతో ప్రతి స్పందించింది.

    ఐతే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొలో భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన విధ్వంసంపై శ్వేత సౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బే స్పందించారు. ఇటువంటి చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, దీన్ని అమెరికా ఖండిస్తోందని చెప్పారు. దీనిపై తమ దౌత్య భద్రతా శాఖ విచారణ జరుపుతోందని అన్నారు. జరిగిన నష్టంపై కూడా దృష్టిపెట్టామని తెలిపారు. రాయబార కార్యాలయాల వల్ల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక అమెరికా, యూకే రాయబార కార్యాలయం వద్ద జరిగిన విధ్వంసాల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం కూడా ఉందని తాము భావిస్తున్నట్లు ఇండియన్ డిస్పొరా స్టడీస్ తెలిపింది. యూకే, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కూడా ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యలపై స్పందించాయి. ఇటువంటి తీరును ఉపేక్షించబోమని చెప్పాయి. ఐతే భారత్ లోని పంజాబ్ లో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ దె చీఫ్‌ అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారన్న ప్రచారం జరుగుతున్న వేళ భారత్ లోనూ పలు చర్యలు తీసుకుంటుంది.

    Trending Stories

    Related Stories