తీవ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. పాక్ పై విరుచుకుపడిన అమెరికా..!

0
798

పాకిస్థాన్ ఎన్నో ఏళ్లుగా తీవ్రవాదులకు కొమ్ము కాస్తూ ఉంది. ఎన్నో దేశాలు చెబుతున్నా కూడా పాకిస్థాన్ తన పంథాను మార్చుకోలేదు. తాజాగా అమెరికా పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 2020 ఏడాదికి గాను ప్రపంచ ఉగ్రవాదం తీరుతెన్నులపై అమెరికా తాజాగా నివేదిక విడుదల చేసింది. పాకిస్థాన్ కేంద్రంగానే భారత్ పై ఉగ్రదాడులకు కుట్రలు జరిగాయని అందులో ఆరోపించింది. పాకిస్థాన్ దాదాపు 12 ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారిందని.. తీవ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవడంలేదని అమెరికా తెలిపింది. ముంబయి దాడుల సూత్రధారులపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అమెరికా తెలిపింది. ఉగ్రవాదులు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, వాటి అనుబంధ సంస్థలు పాక్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించింది. అక్కడి మదర్సాల్లో తీవ్రవాద భావజాలం నూరిపోస్తున్నారని విమర్శించింది. భారత్ పై ప్రశంసలు కురిపిస్తూ.. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడంలో ఎన్ఐఏ సమర్థంగా పనిచేస్తోందని కితాబునిచ్చింది. తీవ్రవాదంపై భారత్ తో కలిసి పని చేస్తూ ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది.

దౌత్య పరంగా అమెరికాకు పాకిస్థాన్ మరింత దూరమవుతూ ఉంది. చైనా అండతో పాక్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిర్వహించిన డెమోక్రసీ సమ్మిట్ ను బహిష్కరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారశైలిపై అమెరికా అసంతృప్తితో ఉండగా.. పాకిస్థాన్ ఎందుకు హాజరు కాలేదో ఇప్పుడు అమెరికాకు వివరించేందుకు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ప్రయత్నిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చలు జరిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

డిసెంబర్ 9,10 తేదీలలో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వర్చువల్ ప్రజాస్వామ్య శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్, పాకిస్థాన్ సహా 110 దేశాలకు ఆహ్వానం అందింది. చైనాకు ఆహ్వానం దక్కకపోవడంతో పాక్ కూడా కాస్త అతి చేసి ఈ సమావేశానికి హాజరు అవ్వలేదు. చైనా పిలుపు మేరకు ఇమ్రాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదనే విషయం ప్రపంచమంతా నమ్ముతోంది. ఇకపై అమెరికా నుండి పాక్ కు నిధులు వచ్చేది కూడా డౌట్ అనే అంటున్నారు. డిసెంబర్ 9న, పాకిస్తాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడానికి నిరాకరించినప్పుడు, చైనా పాక్ ను తన ముఖ్యమైన స్నేహితుడిగా అభివర్ణించింది. ఇప్పుడు చైనా ఏమో సైడ్ అయిపోగా.. పాక్ అమెరికా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది.