ఉక్రెయిన్ పై రష్యా దాడి.. అమెరికా స్పందన ఇదే

0
865

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నామంటూ రష్యా అధినేత పుతిన్ అధికారికంగా ప్రకటన చేశారు. తమకు మిలిటరీపరమైన సహాయం చేయాలంటూ ఉక్రెయిన్ వేర్పాటువాదులు కోరిన తర్వాత రష్యా నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 24న (స్థానిక కాలమానం ప్రకారం) వ్లాదిమిర్ పుతిన్ మాస్కోలో బహిరంగ ప్రసంగంలో ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించారు. ఈ ప్రకటన రష్యా కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రసారం చేయబడింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అదే సమయంలో న్యూయార్క్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో పుతిన్ నుండి ఈ ప్రకటన వచ్చింది.

పుతిన్ యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ లోని 13 ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. ఈ నగరాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కేవలం రెండు గంటల్లోనే రష్యా బలగాలు చేరుకున్నాయి. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని పుతిన్ సూచించారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉక్రెయిన్ పై దాడిని అమెరికా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. ఈ దాడులతో ఉక్రెయిన్‌ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పుతిన్‌ యుద్ధానికి ముందే సిద్ధమయ్యారని బైడెన్ చెప్పారు. ఇది తీవ్రమైన విపత్తు, మానవాళి నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.