రష్యా నుండి చౌకగా చమురు కొంటున్న భారత్.. అమెరికా ఏమి చెబుతోందంటే

0
940

భారత్ కు రష్యా చమురును అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే భారత్ త్వరలోనే ఈ డీల్ కు ఓకె చెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భారత్ కు మార్కెట్ ధర కంటే 25-30 శాతం తక్కువ రేటుకే చమురును సరఫరా చేస్తామంటూ రష్యా ఇప్పటికే ప్రకటించింది. ఎన్నో దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించడంతో తనకు మిత్రదేశమైన భారత్ కు రష్యా ఈ ఆఫర్ చేసింది. 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రస్తుత మార్కెట్ ధర (100 డాలర్లు)తో పోలిస్తే చాలా చౌకగా తీసుకోనున్నట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. చమురును భారత్ తీరానికి చేర్చడంతో పాటు, రవాణా సమయంలో బీమా భద్రతను రష్యాయే తీసుకోనుంది. భారత దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి రష్యాతో తక్కువ ధరలకే డీల్ చేసుకుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గిస్తుందని అంటున్నారు.

ఈ డీల్ పై అమెరికా స్పందించింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం.. రష్యాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఉల్లంఘించడం కాదని అమెరికా అధ్యక్ష కార్యాలయం మీడియా సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు. ఆంక్షలకు కట్టుబడి ఉండాలన్నదే ప్రతి దేశానికి మేము ఇచ్చే సందేశం. కానీ చరిత్రలో ప్రస్తుత సందర్భంలో మీరు ఏ వైపున ఉండాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రష్యా నాయకత్వానికి మద్దతు పలకడం అంటే దురాక్రమణకు మద్దతుగా నిలవడమేనని జెన్ సాకీ తెలిపారు. తాజా పరిణామం పట్ల భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్ ధర కంటే భారత్ రష్యా చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు పుతిన్ వైపు భారత్ నిలిచినట్టు అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఐకమత్యంగా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదని అన్నారు.