ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద జరిగిన బాంబు పేలుళ్లలో 200 మందికి పైగా చనిపోయారు. ఏదో ఒక దేశానికి వెళ్లిపోవాలని అనుకున్న ఆఫ్ఘన్ పౌరులతో పాటూ.. 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనలకు ప్రతీకారం తప్పకుండా ఉంటుందని అన్నారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించిన ఆయన.. ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మట్టుబెడతామన్నారు. ఐసిస్ నేతలను హతమార్చాలని బలగాలను ఆదేశించారు.
అమెరికా హెచ్చరించినట్టుగానే ప్రతీకార చర్యలకు దిగింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులకు పాల్పడింది. నాంగ్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా ఎయిర్ ఫోర్స్.. డ్రోన్లతో దాడులకు దిగింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో ఆఫ్ఘన్ పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని అమెరికా తెలిపింది. ఐఎస్ ఖొరోసన్ ప్రాంతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర దళం. 2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ కలిఫా ప్రకటించిన కొన్ని నెలల్లోనే పాక్ తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులతో చేతులు కలిపారు. వాళ్లంతా కలిసి ప్రాంతీయ దళంగా ఏర్పడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రనేత అబూ బాకర్ అల్ బాగ్దాది ఆదేశాల మేరకే వాళ్లు పనిచేస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని ఈశాన్య ప్రాంతాలైన కునార్, నాన్‌గర్‌హర్, నురిస్తాన్ ప్రావిన్సుల్లో ఖరోసన్ గ్రూపు పట్టు సాధించింది. దీంతో ఆ గ్రూపుకు ఐఎస్ఐఎస్ కేంద్ర నాయకత్వానికి దగ్గరైంది. పాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఐఎస్-ఖరోసన్ గ్రూపు తనకు చెందిన స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసింది. కాబూల్‌లో కూడా ఆ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్.. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పరిస్థితులను చూసి.. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాయి.