National

అమరనాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

అమరనాథ్ యాత్రలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే..! జమ్మూకశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద భారీ వర్షం, కొండల పైనుంచి వస్తున్న వరదల్లో చిక్కుకొని ఇప్పటిదాకా 15 మంది యాత్రికులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు, పోలీసు బృందాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సహాయ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు, తప్పిపోయిన వారి కచ్చితమైన సంఖ్యను నిర్ధారించే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సహాయక చర్యల కోసం సైన్యం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

బాల్టాల్–హోలీ గుహ మార్గం వైపు మరో మేఘం కదులుతోందని, దీని వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటి వల్ల ఆయా ప్రాంతాల్లో వరద ముంచెత్తవచ్చని, కొండచరియలు విరిగి పడిపోవచ్చని తెలిపింది. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

Related Articles

Back to top button