అమర్నాథ్ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తృటిలో తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజా సింగ్ వరదల నుంచి తృటిలో తప్పించుకున్నారు. టెంట్లను వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. అమర్నాథ్లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు.. పెద్ద శబ్దంతో వరద దూసుకొస్తూ కనిపించిందని, భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారని తాను చూసిన ఆ భయానక దృశ్యం గురించి చెప్పారు. తమకు కొద్ది దూరంలోనే ఎంతోమంది వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించారని, తమకు కూడా భయం వేసిందని అన్నారు. అదృష్టవశాత్తు సమయానికి గుర్రాలు దొరకడంతో వాటిపై కిందికి బయలుదేరామన్నారు. కిందికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సమకూర్చి తనను, తన కుటుంబాన్ని శ్రీనగర్ చేర్చినట్టు చెప్పారు. కొన్ని క్షణాలు ఆలస్యమైనా తమ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. గత 3 రోజులుగా అమర్నాథ్ మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు. హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణం అయినట్టు వెల్లడించారు
ఈ నెల 6న రాజా సింగ్ తన కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో అమర్నాథ్ వెళ్లాలని తొలుత అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో అతి కష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే నిద్రపోయి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్నాథ్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్నాథ్లో దర్శనం తర్వాత అరకిలోమీటరు దూరం వరకు వెనక్కి నడిచి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో వరద వచ్చింది.