పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే పార్టీ పేరును, గుర్తును కూడా ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పారు. తన న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని అమరీందర్ సింగ్ తెలిపారు. సమయాన్ని బట్టి మొత్తం 117 సీట్లలో కూడా తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్‌లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ పేర్కొన్నారు.
ఇక కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షాను గురువారం నాడు తాను కలుసుకోనున్నట్టు అమరీందర్ సింగ్ తెలిపారు. సాగు చట్టాల అంశంపై తాను ఈ సమావేశంలో చర్చించనున్నామని అన్నారు. సుమారు 25-30 మందితో హోం మంత్రిని కలుసుకోనున్నట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ను ఆమోదం లభించగానే తాను స్థాపించనున్న కొత్త పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తానని తెలిపారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ పోటీ ఇస్తామని చెప్పారు.
ఇక అమరీందర్ సింగ్ పై నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు:
అమరీందర్ సింగ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శల వర్షం కురిపించారు. తన ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రయోజనాలను అమరీందర్ తాకట్టు పెట్టారని సిద్ధూ ధ్వజమెత్తారు. గతంలో అమరీందర్ పార్టీని ఏర్పాటు చేస్తే కేవలం 856 ఓట్లు ఆయన తెచ్చుకున్నారని అన్నారు. పంజాబ్ ప్రయోజనాలతో రాజీపడిన అమరీందర్ సింగ్‌కు మరోసారి బుద్ధిచెప్పేందుకు పంజాబ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిద్ధూ తెలిపారు.