కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తల గురించి కెప్టెన్ సింగ్ వివరణ ఇచ్చారు. తాను కాషాయ పార్టీలో చేరబోనని, కాంగ్రెస్‌లో కూడా కొనసాగనని ఓ జాతీయ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తనను తీవ్ర క్షోభకు గురిచేసిన పార్టీలో ఇక ముందు కొనసాగబోనని అన్నారు.
పంజాబ్ సీఎంగా కెప్టెన్ వైదొలగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. నవజోత్ సింగ్ సిద్ధూ గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సమావేశమయ్యారు. చండీగఢ్‌లోని పంజాబ్ భవన్లో ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ నగ్రా, సీనియర్ నేతలు పవన్ హోయెల్, ప్రగత్ సింగ్, హరీశ్ చౌదరీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిద్ధూ రాజీనామాను పార్టీ ఇంకా ఆమోదించలేదు. ఈ సమస్యను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని సీఎం చరణ్‌జిత్‌కు పార్టీ అధిష్ఠానం సూచించడంతో చన్నీ సిద్ధూతో ఫోన్లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరడంతో సిద్ధూ నేడు సీఎంతో భేటీ అయ్యారు.
ఆప్ చెంత చేరుతాడా..?
ఇక సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బలమైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అన్నారు. అయితే సిద్ధూ ఆప్‌లో చేరుతారనేది ఊహాత్మకమైన విషయమని తెలిపారు. అటువంటి పరిస్థితులు పంజాబ్ చోటు చేసుకుంటే తామే వెల్లడిస్తామని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున బలమైన నేతను సీఎం అభ్యర్థిగా నిలబెడతామని స్పష్టం చేశారు. అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ లో ఆప్ కూడా బలం పుంజుకుంటూ ఉంది.