National

రాజీనామా చేసేసిన అమరీందర్ సింగ్

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు అమరీందర్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. సొంతపార్టీలోనే అసమ్మతి కారణంగా తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తనకు అవమానం జరగడం ఇది మూడోసారని సోనియా గాంధీకి కూడా చెప్పానని అన్నారు. వాళ్లు ఎవరినైతే నమ్ముతారో వారినే ముఖ్యమంత్రిగా ఉంచుకోవచ్చని అమరీందర్ తెలిపారు. రాజకీయాల్లో ఆప్షన్స్ అన్నవి ఎప్పుడూ ఉంటాయని.. చాలా వేగంగా సాగే గేమ్ పాలిటిక్స్ అని ఆయన అన్నారు. “I hereby tender my resignation as Chief Minister, and that of my Council of Ministers,” అంటూ ఒక్క లైన్ లో తన రాజీనామా లేఖను రాసి గవర్నర్ కు అందించారు.

తన సామర్థ్యంపై కొంచెం అనుమానం వ్యక్తమైనా అది తనకు అవమానమేనని అమరీందర్ చెప్పారు. తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తాను పార్టీలో ఉంటానని, తన సహచరులతో మాట్లాడతానని అన్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు నమ్మకం ఉన్నవారిని ముఖ్యమంత్రిగా నియమించుకోవచ్చునని తెలిపారు. సిద్ధూపై కూడా అమరీందర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అతను ఒక విపత్తు లాంటి వాడు.. అతను ఒక మంత్రిత్వ శాఖను నిర్వహించలేకపోయాడు, అతను పంజాబ్ మొత్తాన్ని ఎలా నిర్వహించగలడు?” అని సిద్ధూను ఉద్దేశించి అమరీందర్ అన్నారు.

కొద్ది నెలల నుండి పంజాబ్ సర్కారులో అసమ్మతి గళం రాజుకుంది. నలుగురు మంత్రులు, రెండు డజన్ల మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు అమరీందర్ నాయకత్వంపై నమ్మకంలేదని వ్యాఖ్యలు చేశారు. సీఎంగా అమరీందర్ సింగ్ అనర్హుడని 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఇటీవలే లేఖ రాశారు. సొంత పార్టీ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూతో కొంతకాలంగా తీవ్ర విభేదాలు అమరీందర్ సింగ్ కు ఉన్నాయి. అమరీందర్ సింగ్ వద్దంటున్నా నవజ్యోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కెప్టెన్ రాజీనామా దాకా తీసుకుని వెళ్లాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − sixteen =

Back to top button