National

ఆల్ట్ న్యూస్ జుబైర్‌కు బెయిల్ నిరాకరణ.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు ఢిల్లీ కోర్టు శనివారం బెయిల్ నిరాకరించింది. మహ్మద్ జుబైర్‌ ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 33 ఏళ్ల జర్నలిస్ట్‌పై సెక్షన్ 120 బి కింద నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేయబడింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ)ని స్పష్టంగా ఉల్లంఘించి విదేశీ నిధులను స్వీకరించినట్లు కూడా అభియోగాలు మోపారు.

విదేశాల నుండి విరాళాలు అందుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 201 (సాక్ష్యం అదృశ్యం చేయడం), 120B (నేరపూరిత కుట్ర), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA)లోని సెక్షన్ 35లను అమలు చేశారు. విచారణలో భాగంగా జుబేర్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను తన మొబైల్ ఫోన్‌ను ఫార్మాట్ చేసి కొన్ని ట్వీట్లను తొలగించాడని పోలీసులు ఆరోపించారు.

మహ్మద్ జుబైర్ తన ట్వీట్లలో ఒకదాని ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలపై జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు ట్రయల్ కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీకి పంపింది. ఒకరోజు కస్టోడియల్ ఇంటరాగేషన్ గడువు ముగిసిన తర్వాత, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (CMM) అతని కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించారు. ఇప్పుడు మరో 14 రోజుల పాటూ కస్టడీలోనే ఉండనున్నాడు మహ్మద్ జుబైర్‌.

Related Articles

Back to top button