Telugu States

గవర్నర్ తమిళిసై ముందే గొడవ పడ్డారు

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. మంగళవారం నాడు యానాంలో పర్యటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. యానాంలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4,400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో నాలుగు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పుదుచ్చేరి విపత్తు నిర్వహణ అథారిటీ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తమిళసేవన్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.

వరద బాధిత యానాంలోని అన్ని కుటుంబాలకు రూ. 5,000 డబ్బులు, 25 కిలోల బియ్యం అందజేస్తామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం తెలిపారు. యానాంలో విలేకరులతో మాట్లాడిన లెఫ్టినెంట్ గవర్నర్ డబ్బు, బియ్యం పంపిణీ ప్రభుత్వ స్వల్పకాలిక చర్యల్లో భాగమని అన్నారు. యానాంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆమె అన్నారు. 137 కోట్లతో పలు నిర్మాణాలతో పాటూ.. దీర్ఘకాలిక చర్యను కూడా ప్లాన్ చేసినట్లు ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని ఆమె తెలిపారు.

యానాం ఆర్‌ఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వల్లవన్‌, ఆర్‌వో అమన్‌ శర్మ, ఎస్పీ బాలచంద్రన్‌ తదితర అధికారులతో గవర్నర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మల్లాడి కృష్ణారావు గవర్నర్‌కు వివరించారు. వరదల ప్రభావం అంచనా వేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. యానాంలో గవర్నర్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మల్లాడి కృష్ణారావు వర్గం, ఎమ్మెల్యే అశోక్‌ అనుచరులు గవర్నర్‌ ఎదుట తమ నేతలను పొగుడుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.

Related Articles

Back to top button