National

పాక్ జాతిపిత జిన్నాను గాంధీ, పటేల్ లతో పోల్చిన అఖిలేష్ యాదవ్

పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్అలీ జిన్నాను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెగ పొగిడేశారు. ఆయనను స్వాతంత్ర్య సమరయోధుడని ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్దోయ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారన్నారు. వీరందరూ భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. సమాజ్‌వాదీ విజయ్ రథయాత్ర సందర్భంగా పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ అఖిలేష్ యాదవ్ మహమ్మద్ అలీ జిన్నాను కీర్తించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మరియు భారత విభజనకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసించారు.

సర్దార్ పటేల్‌ను స్మరించుకుంటూనే అఖిలేష్ యాదవ్ జిన్నాను తెగ పొగిడారు. ‘సర్దార్ పటేల్‌కు ఈ భూమి గురించి తెలుసు, సర్దార్ పటేల్ భూమి గురించి తెలుసు కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నారు, అందుకే ఆయన్ని ఉక్కు మనిషి అని పిలుస్తారు. భారతదేశపు మనిషి. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, జిన్నా ఇలా అందరూ ఒకే సంస్థ నుంచి బయటకు వచ్చారు. వాళ్లంతా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నారు, బారిస్టర్‌లుగా మారి భారత్ కు స్వేచ్ఛను ఇచ్చారు.’ అని అఖిలేష్ వ్యాఖ్యలు చేశారు. నాడు రైతుల కోసం పోరాడిన పటేల్‌కు సర్దార్ అనే బిరుదు వచ్చిందని, ఆయన బాటలోనే పయనిస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ మాత్రం నేడు రైతులను ఏడిపిస్తోందని అఖిలేశ్ దుయ్యబట్టారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో జిన్నా ఓ హీరో అని అఖిలేష్ యాదవ్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేశ్ పేర్కొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిన్నా చరిత్రను ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. హిందువులపై సామూహిక హత్యాకాండను జిన్నా ప్రోత్సహించారని, దేశ విభజనకు కారణమైన వ్యక్తిని ప్రశంసించడం మానుకోవాలని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి మాట్లాడుతూ, “ఆస్ట్రేలియాలో చదువుకున్న అఖిలేష్ యాదవ్ నుండి ఇది విన్న ములాయం సింగ్ కూడా తల పట్టుకుంటారు. దేశం విభజనకు విలన్‌గా మహమ్మద్ అలీ జిన్నాను పరిగణిస్తున్నాము. జిన్నాను స్వాతంత్య్ర వీరుడిగా పిలవడం వెనుక ముస్లింల ఓట్లను సొంతం చేసుకోడానికేనని” అన్నారు.

Related Articles

Back to top button