అఖండ భారత ఆవిర్భావ కల అసాధ్యమేమి కాదని, సమష్టి కృషితో.. ఆ కల అచిరకాలంలో సాధ్యం అవ్వడం తథ్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. హరిద్వార్ లో సాధువులతో ఆయన ముచ్చటించారు. ఈ సమావేశంలో విశ్వ ప్రగతికి సంబంధించి పలు అంశాల గురించి ఆయన సంభాషించారు. అఖండ భారతం, మరో 20-25 ఏళ్లలో సిద్ధిస్తుందని స్వామి రవింద్ర పూరి తెలియజేయగా, ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని భగవత్ తెలిపారు.
బ్రిటీష్ పాలనకు ముందున్న భారతావనే అఖండ భారత్. నాటి అఖండ భారత్ లో భాగస్వామ్యంగా వున్న దేశాలు భారతదేశం,పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్. ఈ తొమ్మిది దేశాలు కలిసివున్న అఖండ భారతదేశాన్ని బ్రిటీష్ రూలర్లు పాలించారు. ఆంగ్లేయుల పాలనలో కొన్ని దేశాలను చీల్చివేశారు. దీంతో, అఖండ భారతావనికి గండి పడింది. విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్, దుర్గావాహిని తదితర సంస్థలు ఇప్పటికీ.. అఖండ భారత్ సాధన కోసం అవిశ్రామంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భగవత్ ‘అఖండ భారత్’ కల త్వరలోనే నెరవేరబోతోంది అని వ్యాఖ్యానించటం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అఖండ భారత్ కల సాకారం కాబోతోందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి రవీంద్ర పూరి ఇటీవల వెల్లడించారు. మహానిర్వాని అఖాడా పేరొందిన స్వామి రవీంద్ర పురి, అఖండ భారత్ కల మరో 20, 25 ఏళ్లలో నిజం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వామి రవీంద్ర పూరి వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోహన్ భగవత్, తాను సైతం, స్వామి ప్రకటనతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. గీతాచార్యుడు వాంఛించిన విధంగా భారతావని ఎదుగుతుందని అరబిందో వంటి తత్తవేత్తలు చెప్పిన వాక్కులు నిజం కావడంలో సందేహం ఏమీ లేదని అన్నారు. భారత దేశం గురించి స్వామి వివేకానంద, అరబిందో చెప్పిన అమృత వాక్కులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
అఖండ భారత్ విషయం గురించి తాను స్వయం ఊహతో చెబుతున్నాను తప్ప జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి కాదని మోహన్ భగవత్ చెప్పారు. అయితే, స్వామి రవీంద్ర పూరి తెలియజేసిన ఈ విషయంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అది తప్పక జరిగి తీరుతుందని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. అఖండ భారతం సాధించడానికి అందరం కలిసి వేగవంతంగా అడుగులు వేస్తే.. స్వామి చెప్పిన 25, 30 ఏళ్ల కంటే చాలా ముందుగానే లక్ష్యాన్ని సాధించ వచ్చని భగవత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హింసకు తావు లేని ప్రగతిని భారత దేశం కాంక్షిస్తుందని, అహింస గురించి దేశం సంభాషిస్తుందని, అయితే, దండం చేతబట్టడంలో ఏ మాత్రం సందేహం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హరిద్వార్ లో సాధువులతో ఆయన ముచ్చటించారు. ఈ సమావేశంలో దేశ ప్రగతికి సంబంధించి పలు అంశాల గురించి ఆయన సంభాషించారు.
జగన్నాథ రథ చక్రాలు ఆగని విధంగా, భారతదేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ఇప్పుడది ఆగదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తెలియజేశారు. పరుగులు తీస్తున్న వాహనం లోకి ఎవరూ రాలేని విధంగా.. భారత ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని భగవత్ చెప్పారు. అహింస గురించి మాట్లాడతాం, అయితే కర్రతో నడుస్తాం, ఆ కర్ర బరువుగా ఉంటుందని భగవత్ చెప్పారు.
హిందూ రాష్ట్రం అంటే సనాతన ధర్మం తప్ప మరొకటి కాదని భగవత్ తెలిపారు. వైవిధ్యాన్ని, సంప్రదాయాలను గౌరవ ప్రదంగా వుంచుకున్నామని, వైవిధ్యం కారణంగా భిన్నంగా లేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని భగవత్ తెలిపారు. విభేదాలు మరచి కలిసికట్టుగా ముందుకు సాగితే లక్ష్యసాధన ఖాయమని భగవత్ తెలిపారు.
ఎవరితోనూ బేధభావం, ద్వేషభావం తమకు లేవని, శతృత్వం అసలే లేదని భగవత్ చెప్పారు. ప్రపంచం శక్తిని మాత్రమే అర్థం చేసుకుంటుందని, మనకు బలం వుండాలని, అది కనిపించాలని భగవత్ వివరించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మంచిని కాపాడుతూ ఉండాలని, అలాగే దుష్టులను నాశనం చేయడం మర్చిపోకూడదని అన్నారు.