More

    దోవల్ వ్యూహ చట్రం.. వైరికి పెను సవాల్..!

    యుద్ధం గెలవాలంటే.. ముందు శత్రువు సామర్థ్యం అంచనా వేయాలి. వైరి బలాల్ని, బలహీనతల్ని బేరీజు వేసుకోవాలి. దానికనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.. యుద్ధ రంగంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శత్రువు ఊహించని విధంగా ఎదురు దాడికి దిగాలి. ఈ యుద్ధ సూత్రం మహాభారత కాలం నుంచి నేటి దాకా ఆచరణలో ఉన్నదే. కానీ విదేశీ దండయాత్రలు.. దురాక్రమణల మూలంగానో లేక బానిస మనస్తత్వపు ప్రభావమో తెలీదు గాని స్వాతంత్ర్యానంతరం భారత దేశం కేవలం రక్షణాత్మక వైఖరికే పరిమితమైంది. 72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి.. 2014 లో ఏర్పడిన NDA ప్రభుత్వం డిఫెన్సివ్ ధోరణికి భిన్నంగా ఆఫెన్సివ్ దృక్పథాన్ని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల మనో స్థైర్యాన్ని పెంచడంతో… భీకరమైనవిగా భావించిన శత్రు మూకలు సైతం పలాయనం చిత్తగించాయి. ఈ కొత్త భారతానికి ఊపిరులూదిన ద్వయం ప్రధాని నరేంద్ర మోడీ.. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్.

    రక్షణ వ్యవహారాలపై పరిశోధన చేసే అంతర్జాతీయ think tank .. Stockholm international peace research institute (SIPRI) ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతులు-దిగుమతులపై గత వారం ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2011-15 సంవత్సరాల కాలంతో పోల్చితే 2016-20 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు 33 శాతం మేర తగ్గినట్టు ప్రకటించింది.ఓవైపు భారత ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయింపులని ఈ మధ్య కాలంలో భారీగా పెంచింది..

    మరోవైపు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కూడా తీవ్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుధ దిగుమతులు తగ్గడం ఏంటి అన్న సందేహం రావొచ్చు. దీనికి కారణం తెలుసుకోవాలంటే మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను విశ్లేషించుకోవాలి. రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అజిత్ దోవల్ రూపొందించిన నయా సెక్రటేరియట్ గురించి తెలుసుకోవాలి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ జాతీయ రక్షణ సలహాదారుగా అజిత్ దోవల్ ని నియమించారు. అదే సంవత్సరం make in india కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓవైపు భారత రక్షణ అవసరాలను అంచనా వేస్తూనే మరోవైపు రక్షణ రంగంలో భారతీయ పరిజ్ఞానాన్ని పెంచే పనిలో పడ్డారు.

    ఈ ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే కాలం చెల్లిన విధానాలతో కూడిన బ్యూరోక్రసి వలయాన్ని ముందు సరి చేయాలి. సంప్రదాయ విధానాల్లో మార్పు తేవాలి. కొత్త భారతానికి తగిన విధంగా సరికొత్త విభాగాలు ఏర్పాటు కావాలి.. అని అజిత్ దోవల్ భావించారు. దానికనుగుణంగానే అప్పటిదాకా కేవలం అడ్వైసరీ బోర్డుగా కొనసాగుతూ వచ్చిన NATIONAL SECURITY COUNCIL SECRETARIAT ని నీతి ఆయోగ్ తరహాలో అత్యున్నత ప్రభుత్వ విభాగంగా ఏర్పాటు చేసారు. 2018 లో ప్రభుత్వ అల్లోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (AOB) పరిధి లోకి NATIONAL SECURITY COUNCIL SECRETARIAT ని చేర్చి దీనికి రాజ్యాంగ బద్దమైన హోదా కల్పించారు. అంతే కాదు NSCS అధికారాలను విస్తృత పరచడంతో దేశ అంతర్గత భద్రతా, అంతర్జాతీయ వ్యవహారాలపై అధ్యయనంతో పాటు నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమైంది. జాతీయ రక్షణ రంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం ప్రశంసించారు. NSCS పనితీరుని ఒకసారి పరిశీలిద్దాం.

    ప్రధాన మంత్రికి డైరెక్ట్ గా రిపోర్ట్ చేసే NATIONAL SECURITY COUNCIL SECRETARIAT కి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సారధ్యం వహిస్తున్నారు. ఆయన కింద మొత్తం నాలుగు విభాగాలు పని చేస్తాయి. అందులో మూడు విభాగాలను ముగ్గురు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్లు, ఒక విభాగాన్ని మిలిటరీ అడ్వైసర్ టు NSA పర్యవేక్షిస్తారు. ఈ నాలుగు విభాగాల్లో ఒక విభాగానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ రాజిందర్ ఖన్నా అధ్యక్షత వహిస్తున్నారు. 1978లో research & analysis wing లో చేరిన రాజిందర్ ఖన్నా పలు హోదాల్లో పని చేసి RAW చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సారధ్యంలో NSCS లోని ఒక విభాగం టెక్నాలజీ- ఇంటలిజెన్స్ పై పని చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ని అంచనా వేస్తూ.. తదనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించడం వీరి పని. సైబర్ సెక్యూరిటీ, 5జి టెక్నాలజీ సహా భారత దేశంలోని కీలక రంగాలపై ముష్కర మూకలు సైబర్ దాడులు జరపకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా వీరు ప్రభుత్వ విభాగాలకు సూచనలు చేస్తుంటారు. అవసరమైతే శత్రు మూకలపై సాంకేతిక దాడులకు కూడా సిద్ధమయ్యేలా దిశానిర్దేశం చేస్తుంటారు. అంతేకాదు Future టెక్నాలజీ పైన కూడా అధ్యయనం చేస్తూ స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా నిర్ణయాలు చేయడం ఈ విభాగం బాధ్యత.

    ఇక NSCS లోని మరో విభాగాన్ని డిప్యూటీ NSA పంకజ్ శరన్ లీడ్ చేస్తున్నారు. 1982 బ్యాచ్ IFS అధికారి అయిన పంకజ్ శరన్ 2007 – 2012 మధ్య కాలంలో అప్పటి ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. పలు దేశాల్లో భారత దౌత్యవేత్తగా విశేష సేవలందించిన పంకజ్ శరన్ సారధ్యంలోని ఈ విభాగం అంతర్జాతీయ వ్యవహారాలూ..maritime affairs పై పని చేస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి, ఇండో పసిఫిక్ రీజియన్ లోని కీలక అంశాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేయడంలో ఈ విభాగం విశేషంగా కృషి చేస్తుంది. ఇక మరో విభాగం అంతర్గత భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. దీనికి డిప్యూటీ NSA దత్తాత్రేయ padsalgikar అధ్యక్షత వహిస్తున్నారు. 1982 బ్యాచ్ కి చెందిన మహారాష్ట్ర క్యాడర్ IPS అధికారి … దత్తాత్రేయ padsalgikar. గతంలో భారత ఇంటలిజెన్స్ బ్యూరో అధికారిగా.. ముంబై కమీషనర్ గా.. మహారాష్ట్ర డీజీపీ గా పని చేసిన ఆయన 2019లో డిప్యూటీ NSA గా బాధ్యతలు చేపట్టారు. NATIONAL SECURITY COUNCIL SECRETARIAT లో ఈయన దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విభాగం పాలసి ప్లానింగ్, కౌంటర్ టెర్రరిజం, సరిహద్దుల్లోని సమస్యలు, చైనా సహా పలు శత్రు దేశాల విచ్చిన్నకర కుట్రలపై పని చేస్తోంది. అంతర్గత సమస్యల పరిష్కారానికై ప్రధానికి నివేదికలు సమర్పించడమే కాదు ఆయా కేంద్ర ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తుంది. ఇక జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ లోని మరో కీలక విభాగం.. మిలిటరీ అడ్వైజర్ టు NSA సారధ్యంలో పని చేస్తుంది. కార్గిల్ యుద్ధం లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వీజీ ఖండారే NSCS లోని ఈ విభాగానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఇది సరిహద్దుల్లో శత్రు సైన్యాలకు ధీటుగా వ్యూహ రచన చేయడంలో.. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు నెరపడంలో.. మిలిటరీ భవిష్యత్ అవసరాలను అంచనా వేస్తూ సాంకేతికంగా బలోపేతం చేయడంలో కృషి చేస్తుంది.

    మొత్తంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపుతూ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ని పటిష్ట పరిచారు. ఒక్క సైనిక బలగాలకు మాత్రమే కాకుండా… అంతర్గత భద్రతా విభాగాలకు, సైబర్ డిఫెన్స్ ఏజెన్సీస్ కి, స్పేస్ ఏజెన్సీకి, DRDO, ఇస్రో లాంటి భారత విజ్ఞాన పరిశోధనా సంస్థలకి అనుసంధానిస్తూ రెస్పాన్సివ్ గా వ్యవహరించే విధంగా అజిత్ దోవల్ సారధ్యంలోని NSCS దిశా నిర్దేశం చేస్తోంది. రక్షణ రంగంలో భారత దిగుమతులు తగ్గడానికి అజిత్ దోవల్ సారధ్యంలోని NSCS కి ఏంటి సంబంధం..? ఇప్పుడు చూద్దాం.

    2014 లో మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అదే సంవత్సరం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కు రూపకల్పన చేసారు. ఆ క్రమంలోనే 2016లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ని రక్షణ రంగానికి కూడా విస్తరిస్తూ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసెడ్యూర్ లో IDDM అనే కొత్త క్యాటగిరీని చేర్చారు. IDDM అంటే Indeginously designed, developed, manufactured అని అర్థం. అంటే పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తులు అన్నమాట. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా భారత కంపెనీలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేసే ఉత్పత్తులను భారత సైనిక అవసరాలకు వినియోగించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంతే కాదు… రక్షణ రంగ సంస్కరణల్లో భాగంగా 2018లో కేంద్ర ప్రభుత్వం Inter ministerial defence committee ని ఏర్పాటు చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు త్రివిధ దళాధిపతులు, కేంద్ర రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. భారతీయ కంపెనీల్లోకి వస్తున్న విదేశీ పెట్టుబడులు… సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విదేశీ జోక్యాన్ని అరికట్టడం .. రక్షణ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ కంపెనీల ఉత్పత్తి సామర్త్యాన్ని పెంచే విధంగా నిర్ణయాలు చేయడం .. రక్షణ రంగ ఉత్పత్తుల నాణ్యత అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా చర్యలు తీసుకోవడం ఈ కమిటీ విధుల్లో ప్రధానమైనవి.లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడీ ఇచ్చిన ఆత్మ నిర్భర భారత్ నినాదానికి అనుగుణంగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన 101 ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని.. భారత్ లోనే ఆ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ చేసిన సిఫారసుల మేరకే కేంద్ర మంత్రి ఆ ప్రకటన చేశారు.

    ఓవైపు రక్షణ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేస్తూనే.. దేశీయ కంపెనీలకు ఆర్ధిక బలాన్ని చేకూర్చేందుకు విదేశీ పెట్టుబడులను 74 శతం వరకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల భద్రతా పరమైన చిక్కులు ఎదురవకుండా అజిత్ దోవల్ సారధ్యం లోని NSCS, డిఫెన్స్ ప్లానింగ్ కమిటిలు నిఘా పెడతాయి. ఒక్క రక్షణ రంగం లోనే కాకుండా… దేశ భద్రతకు సంబంధించిన కీలక విభాగాలకు సంబంధించి వివిధ ఉన్నత స్థాయి కమిటీలు విదేశీ పెట్టుబడులపై నిఘా ఉంచేలా అజిత్ దోవల్ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసారు. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ … నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలి కమ్యూనికేషన్స్.. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ… ఇలా పలు సంస్థలు జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ సారధ్యంలోని National Security Council Secretariat కు అనుసంధానంగా పని చేస్తుంటాయి.

    దోవల్ చేసిన ఈ సంస్కరణల ఫలితంగా.. అనేక విజయాలను భారత్ నమోదు చేస్తోంది. 2018లో ఏర్పాటైన డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం లోని శత్రు దేశపు శాటిలైట్ ని క్షణాల్లో కూల్చగలిగే Anti Satelite Missile test 2019 లో విజయవంతంగా ప్రయోగించి… ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా ల సరసన భారత్ ను నిలిపింది. అంతేకాదు భారత రక్షణ అవసరాల నిమిత్తం… మిస్సైల్స్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ఎక్విప్మెంట్ సహా ఆర్మర్డ్ వెహికల్స్ తయారీ ప్రస్తుతం భారత్ లోనే జరుగుతోంది. నావికా దళం కోసం న్యూక్లియర్ సబ్ మెరైన్స్ భారత్ లోనే తయారవుతున్నాయి. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచడంతో, దేశీయ కంపెనీలు ఆర్థికంగా బలపడ్డాయి. అదే సమయంలో టెక్నాలజీ పేరుతొ విదేశీయులు మన వ్యవహారాల్లో జొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దీంతో పూర్తీ స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ భారత రక్షణ అవసరాలకు సరిపడా ఉత్పాదకత పెంచే ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. ఆ క్రమంలోనే భారత్ రక్షణ రంగంలో దిగుమతులు 33 శాతం మేర తగ్గాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ 2025 సంవత్సరానికల్లా భారత్ రక్షణ పరికరాల ఎగుమతుల ద్వారా 5 బిలియన్ డాలర్ల మార్క్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమర్ధమైన నాయకత్వానికి నిజాయితీ, నిబద్ధత కలిగిన దేశ భక్తుడు తోడైతే అసాధ్యమనుకున్నవి కూడా సుసాధ్యాలవుతాయడానికి మోడీ – దోవల్ జోడీయే ప్రత్యక్ష సాక్ష్యం. Everything apart.. Nation First..

    Trending Stories

    Related Stories