ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్ లో భారత్ పై 10 వికెట్లు తీసి అరుదైన రికార్డును అందుకున్నాడు. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 10 వికెట్లు తీసిన 3వ బౌలర్‌గా అజాజ్ పటేల్ నిలిచాడు. క్రికెట్ చరిత్రలో అజాజ్ పటేల్ పేరు నిలిచిపోనుంది. 47.5 ఓవర్లు బౌలింగ్ వేసిన అజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. శుభమన్ గిల్ ను అవుట్ చేసి మొదటి వికెట్ తీయడం మొదలు పెట్టిన అజాజ్ పటేల్.. 10వ వికెట్ గా సిరాజ్ ను పెవిలియన్ కు పంపాడు. అజాజ్ పటేల్ బౌలింగ్ ధాటికి భారత్ 325 పరుగులకు ఆలౌట్ అయింది. అజాజ్ పటేల్ న్యూజిలాండ్ కు ఆడుతున్నా.. అతడు పుట్టింది ముంబైలోనే..! అజాజ్ పటేల్ సాధించిన అద్భుతమైన ఫీట్ కు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా టూర్ పై:
దక్షిణాఫ్రికా టూర్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టత నిచ్చింది. భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పింది. అయితే.. ఈ పర్యటనలో టీమ్ఇండియా టెస్టులు, వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుందని.. టీ 20 లపై తరువాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సెక్రటరీ జే షా శనివారం తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారం టీమ్ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. నాలుగు టీ20లను తరువాత షెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించారు.