గౌహతిలోని మా కామాఖ్య దేవాలయం కోసం మొఘల్ పాలకుడు ఔరంగజేబు భూమిని విరాళంగా ఇచ్చాడని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అస్సాంలో వివాదానికి తెరతీశాయి. దింగ్ నియోజకవర్గం, ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అయిన అమీనుల్ ఇస్లాం భారతదేశంలోని వివిధ హిందూ దేవాలయాలకు ఔరంగజేబు భూములు ఇచ్చాడని వ్యాఖ్యలు చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. మీడియాతో అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ హిందూ దేవాలయాల కోసం ఔరంగజేబు భూములను విరాళంగా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. “సామ్రాట్ (ఔరంగజేబు) ఇచ్చిన భూమి కేటాయింపు అనుమతి ఇప్పటికీ కామాఖ్య ఆలయంలో ఉంది, అలాగే భారతదేశంలోని అనేక ఇతర హిందూ దేవాలయాలలో భూమి కేటాయింపు అనుమతులు ఉన్నాయి” అని ఆయన అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఇలాంటి పనులు చేసినందుకు ఇప్పటికే ఒకరు జైలులో ఉన్నారు.. ఇలాంటి ప్రకటనలు కొనసాగిస్తే అమీనుల్ కూడా జైలులో ఉంటాడని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ గతంలో అక్టోబరు 6న నిధులు మొత్తం తినేసి కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు. “నా పరిపాలనలో వారు నన్ను అవమానించవచ్చు, ఆర్థిక వ్యవస్థ మరియు ఇతర విషయాలను విమర్శిస్తారు, కానీ మా సంప్రదాయాలు, సంస్కృతికి వ్యతిరేకంగా అవమానిస్తే మేము సహించము” అని హిమంత బిస్వా శర్మ అన్నారు. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలపై కుటుంబ సురక్ష మిషన్ అనే హిందూ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దిస్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారికి పంపిన ఫిర్యాదు లేఖలో అమీనుల్ ఇస్లాం మా కామాఖ్య దేవాలయం వాస్తవికత, స్థాపన గురించి తీవ్రమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన చాలా అభ్యంతరకరమైనది.. ప్రజలను తప్పుదారి పట్టించేదని అన్నారు. హిందువుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడం, మా కామాఖ్య గౌరవానికి భంగం కలిగించడం, వాస్తవాలను వక్రీకరించడం చేశారని అన్నారు. అమీనుల్ ఇస్లాం మత ఛాందసవాదని, రాష్ట్ర అంతర్గత భద్రతకు తీవ్రమైన ముప్పు అని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు.