More

  సరిహద్దుల్లో మరోసారి డ్రాగన్ కవ్వింపులు..! సరైన బుద్ది చెప్పిన భారత బలగాలు

  డ్రాగన్ తీరు ఇక మారదు.. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడం.. లేదంటే సరిహద్దు దేశాలతో కయ్యానికి దువ్వడం చైనాకు అలవాటుగా మారిపోయింది. పక్క దేశాల భూబాగాలను తమ దేశంలో కలుపుకునేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందులోనూ భారత్ ను ఎప్పుటికప్పుడు రెచ్చగొట్టడం డ్రాగన్ దేశానికి పరిపాటిగా మారింది.

  తాజాగా మరోసారి సరిహద్దులో భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఒకవైపు సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుతూనే, మరోవైపు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్-చైనా సరిహద్దుగా పిలిచే ‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా యుద్ధ విమానాలు భారత సరిహద్దు సమీపంలోకి దూసుకొస్తున్నాయి. ఉత్తర లదాఖ్ ప్రాంతంవైపు చైనా విమానాలు దూసుకొస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఘటనలు చాలా సార్లు జరిగాయి.

  గత మూడు, నాలుగు వారాల్లో ఇలా చైనా విమానాలు భారత్ వైపు వస్తున్నాయి. అయితే, భారత్ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది. అలాగే భారత్‌కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలు, మిరేజ్ 2000 విమానాల్ని కూడా భారత్ సరిహద్దులోకి పంపిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే మన విమానాలు కూడా స్పందిస్తున్నాయి. కాగా, సరిహద్దులో మన వైమానిక సామర్ధ్యాన్ని పరీక్షించేందుకే చైనా ఇలా తరచూ విమానాల్ని భారత్ వైపు పంపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా సమగ్రంగా సిద్ధమవుతోంది. సరిహద్దుల్లో అవసరమైన నిర్మాణాలు చేపడుతోంది. ఏ పరిస్థితి ఎదురైనా వెంటనే ఎదుర్కొనేలా సరిహద్దుల్ని, సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. చైనా విమానాల కవ్వింపు చర్యల అంశాన్ని ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కూడా ప్రస్తావించారు. చైనా విమానాలు దూసుకొచ్చే దశలో ఎదుర్కొనేందుకు హై అలర్ట్‌తో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.

  మరోవైపు సరిహద్దుల్లో డ్రాగన్ దేశం రహస్య గ్రామం నిర్మించిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం మరువకముందే మరోసారి ఆ దేశం తన కండకావరాన్ని బయటపెట్టింది. భారత బలగాలను రెచ్చగొట్టే విధంగా రాకెట్ లాంఛర్‎ను ప్రయోగించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత సరిహద్దు వద్ద రాకెట్​ పరీక్ష నిర్వహించింది. అడ్వాన్స్​డ్​ మల్టిపుల్​ లాంచ్​ రాకెట్​ సిస్టమ్‎ను పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీగా పేరొందిన చైనా సైన్యం.. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రయోగించింది. ఈ రాకెట్​.. భారత సైన్యం ఉన్న శిబిరాలని ఢీకొట్టేంత చేరువగా వచ్చినట్టు సమాచారం. చైనాలోని జిన్​జియాంగ్​ ప్రాంతంలో రాకెట్​ వ్యవస్థను చైనా ప్రయోగించి. ఆ రాకెట్​.. 5,300మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. కాగా.. పీహెచ్​ఎల్​-16 ఎంఎల్​ఆర్​ఎస్​ వంటి అత్యాధునిక రాకెట్​ వ్యవస్థను భారత్​- చైనా సరిహద్దు వెంబడి మోహరించేందుకు డ్రాగన్​ ప్రణాళికలు రచిస్తోంది.

  తాజా పరిణామాలతో ఇప్పటికే దారుణంగా ఉన్న భారత్​-చైనా సంబంధం మరింత బలహీన పడే అవకాశం లేకపోలేదు. రెండున్నరేళ్ల క్రితం.. వాస్తవాధీన రేఖ వెంబడి అలజడులు సృష్టించింది చైనా. ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్ని చర్చలు, ఎన్ని భేటీలు జరుపుతున్నా.. సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు. అంతకుముందు ఇరు దేశాల సరిహద్దుల్లో డ్రాగన్ రహస్య గ్రామం నిర్మించిన విషయం బయటపడింది. ఆక్రమించడంలో ఆరి తేరిన చైనా.. సరిహద్దులోని గ్రామాలను తన భూభాగంలో ఉన్నట్టుగా చూపించుకుంటున్నది. సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకువచ్చి భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది.

  భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ల క్రితమే 2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటంపై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. తరుచూ దురాక్రమణవాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా.. భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని అప్పుడు మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. చైనా తన సలామీ స్లైసింగ్‌ విధానాన్ని భూటాన్‌పై ప్రయోగిస్తోందనేది నిపుణులు అంచనా వేశారు. అయితే చైనా మాటలు, చేష్టలు వేరువేరుగా ఉంటున్నాయి. చర్చల్లో శాంతి జపం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో మాత్రం డ్రాగన్ ఉద్రిక్తతలు పెంచుతోంది. అత్యంత వివాదాస్పద పాంగ్యాంగ్​ సరస్సుకు సమీపంలో కొద్ది రోజుల క్రితం చైనా సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు వార్తలొచ్చాయి.

  Trending Stories

  Related Stories