మిరాజ్-2000 శ్రేణికి చెందిన ఓ యుద్ధ విమానం మధ్యప్రదేశ్ లో నేలకూలింది. బింద్ జిల్లాలోని మంకాబాద్ వద్ద ఓ నిర్జన ప్రదేశంలో ఈ ఫైటర్ విమానం కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఎయిర్ బేస్ నుంచి నింగికి ఎగిరిన మిరాజ్ యుద్ధ విమానం కొద్దిసేపట్లోనే గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ తో సంబంధాలు కోల్పోయింది. ప్రమాదం జరుగుతుందని భావించిన పైలెట్ పారాచూట్ సాయంతో తప్పించుకున్నాడు. పైలెట్ సురక్షితంగా ఉన్నాడని భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ అభిలాష్ పారాచూట్ సాయంతో కిందకు దూకారు. పొలంలో పడిపోవడంతో చిన్న చిన్న గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం లేదు. చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మిరాజ్ 2000 యుద్ద విమానం మాత్రం కుప్పకూలిన తరువాత భూమిలో కుంగిపోయింది. విమానం తోక మాత్రమే బయటకు కన్పించింది.
భింద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంకాబాద్‌లోని ఖాళీ మైదానంలో విమానం ముక్కలు ముక్కలైనట్లు విజువల్స్ లో కనిపించాయి. పోలీసుల బృందం క్రాష్ సైట్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. ట్రైనర్ జెట్ టెయిల్ భాగం భారీగా పాడైనట్లు గుర్తించారు. మైదానంలో ఉన్న వ్యక్తి మొబైల్ తో తీసిన వీడియోలో పైలట్ పారాచూట్ తో సజావుగా కిందకు దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కూలిన విమానం నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై భారత వైమానిక దళం దర్యాప్తుకు ఆదేశించింది.