More

    వందేమాతరం పాడనని చెప్పిన ఎంఐఎం ఎమ్మెల్యే

    ‘వందేమాతరం’ ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సగర్వంగా చెప్పుకుంటాడు. కానీ కొందరు నాయకులు దీన్ని కూడా మతం కోణంలో చూస్తారు. వందేమాతరం చెప్పడం తమ మతానికి వ్యతిరేకమని చెప్పిన నాయకుల లిస్టు పెరిగిపోతూ ఉంది. తాజాగా బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్, భారతదేశ జాతీయ గీతం ‘వందేమాతరం’పై అభ్యంతరం లేవనెత్తారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఇమాన్ శుక్రవారం బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు సందర్భంగా జాతీయ గీతం ‘వందేమాతరం’ని పాడటానికి నిరాకరించారు. మత విశ్వాసాలకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు.

    ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రస్తుత బీహార్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. శీతాకాల సమావేశాల ప్రారంభంలో శాసనసభ్యులందరూ జాతీయ గీతం (జన గణ మన) ఆలపించారు. ముగింపు రోజు జాతీయ గేయం (వందేమాతరం) ఆలపించారు.

    AIMIM బీహార్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ‘వందేమాతరం’ అని చెప్పడం తన మతానికి విరుద్ధమని అన్నారు. “ప్రతి వ్యక్తికి తన స్వంత ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. వందేమాతరం చెప్పమని నన్ను బలవంతం చేయవద్దు” అని ఇమాన్ అన్నారు. ప్రతి సందర్భంలోనూ జాతీయ గీతం లేదా జాతీయ గేయాన్ని పఠించడానికి గల కారణం ఏమిటో చెప్పండి.. ఇది అవసరమని ఎవరు చెప్పారని ఇమాన్ బీహార్ అసెంబ్లీ వెలుపల విలేకరులను ఎదురు ప్రశ్నించారు. “కారణం లేకుండా జాతీయ గీతం పాడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో ఇలాంటివేమీ చెప్పలేదు. వందేమాతరం పాడడంలో నాకు సమస్య ఉంది. అది మా విశ్వాసానికి సంబంధించినది. కొన్ని వెజ్.. ఇంకొన్ని నాన్ వెజ్. ఇది జరగదు. నేను వందేమాతరం పాడనంటే పాడను” అన్నారాయన. బీహార్ అసెంబ్లీ స్పీకర్ బలవంతంగా ఈ సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారని అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎమ్మెల్యే అన్నారు. భారత రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందని, అయితే ‘వందేమాతరం’ పాడడంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు.

    హిందుస్థాన్ అనే పదంపై కూడా గతంలో అభ్యంతరం తెలిపిన ఇమాన్

    AIMIM ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ తన అఫిడవిట్‌లో వ్రాసిన ‘హిందూస్థాన్’ అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి కూడా వివాదాన్ని రేకెత్తించాడు. హిందూస్థాన్ అనే పదాన్ని తాను పలకనని.. ‘భారత్’ అనే పదాన్ని వాడుతానని అన్నారు.
    ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘హిందుస్థాన్’ అనే పదంతో సమస్య ఉన్నవారు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చని బీజేపీ నేత ప్రమోద్ కుమార్ AIMIM ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ ని మందలించారు.

    Trending Stories

    Related Stories