అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ విభాగంలో ఈ పథకం కింద అగ్నివీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అగ్నివీర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించేసింది. భారత సైన్యంలోని నావికా దళంలో అగ్నివీర్ల భర్తీ కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ల భర్తీ కోసం ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. వెరసి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ల నియామకాల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచే ప్రారంభించినట్టైంది. కేంద్రం అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగ యువతలో ఉన్న అపోహలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2022 తేదీలు, పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం, భారత సైన్యం కోసం అగ్నిపథ్ నోటిఫికేషన్ 2022 ఈరోజు జూన్ 20, 2022న విడుదల చేయబడుతుందని, అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇండియన్ ఆర్మీలో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అగ్నివీరులు జూన్ 20, 2022 నుండి తమ దరఖాస్తులను నమోదు చేయవచ్చునని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం పూర్తి షెడ్యూల్ పూర్తి వివరాలను ప్రకటించింది. భారత సైన్యంలో రిజిస్ట్రేషన్లు జూన్ 20, 2022 నుండి ప్రారంభం అవ్వగా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రిజిస్ట్రేషన్లకు జూన్ 24, 2022.. ఇండియన్ నేవీ రిజిస్ట్రేషన్లకు జూన్ 21, 2022 నుండి ప్రారంభం అవుతుంది.