చైనాకు సమాధానం ఇచ్చేలా.. అగ్ని-5 మిసైల్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్

సరిహద్దుల్లో చైనా భారత్ ను రెచ్చగొట్టేలా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే..! చైనా కు సమాధానం చెప్పేలా.. భారత్ కీలక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తీ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) బుధవారం నాడు అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ప్రయోగం చేపట్టింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 5000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించనున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పరీక్ష రాత్రి 7.30 గంటలకు అబ్దుల్ కలాం ద్వీపంలో జరిగింది. అగ్ని సిరీస్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కొత్త అగ్ని క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది. ఇంతకు ముందు డీఆర్డీఓ జూన్లో అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది.
ఇది భారత రక్షణ రంగ వ్యవస్థలో మరో అద్భుతమని.. ఉపరితం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అగ్ని – 5 బాలిస్టిక్ క్షిపణినిని బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని భారత రక్షణ రంగంలో మరో పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో భారత రక్షణ రంగం శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లైంది.
అగ్ని-1 నుండి అగ్ని- 5 క్షిపణులను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది, అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం, అగ్ని-5 కాకుండా, భారతదేశం తన ఆయుధశాలలో ఇతర అగ్ని క్షిపణులు ఉన్నాయి. 700-కిమీ పరిధితో అగ్ని-1, 2,000-కిమీ పరిధితో అగ్ని-2, 2,500తో అగ్ని-3 మరియు అగ్ని-4 కిమీ నుండి 3,500 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించవచ్చు. అగ్ని-5 సక్సెస్ అవ్వడం చైనాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని నిపుణులు చెబుతున్నారు.